
సాక్షి, అమరావతి: ఎన్ని శక్తులు ఏకమైనా 2024 ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని అన్ని వర్గాలూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. ‘సిద్ధం’ సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూస్తే.. సీఎం జగన్‌పై ప్రజలకు ఏస్థాయిలో అభిమానముందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పరోక్షంగా చెప్పేశారు.
చంద్రబాబు కుప్పంలో ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తెలిసే.. బాబుకు ఇక విశ్రాంతి అవసరమంటూ భువనేశ్వరి అన్నారు. నారా కుటుంబం ఓటమిని ముందే అంగీకరించింది. కుప్పంలో సైతం ఓడిపోతానని తెలిసే.. అక్కడి నుంచి పారిపోయేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఒంటరిగా సీఎం జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ, బీజేపీతో కలిసి వస్తున్నామని పవన్‌కళ్యాణ్ అంటున్నారు.
ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేనప్పుడు.. రాజకీయాలు ఎందుకు? అసలు ఏం చూసి ప్రజలు చంద్రబాబుకు, బీజేపీకి, పవన్‌కు ఓటు వేయాలి? 2014లో 650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేయకుండా చంద్రబాబు కూటమి ప్రజల్ని మోసం చేస్తే.. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. వైఎస్ జగన్ పాలనలో కులమతాలు,
పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ సీఎం జగన్ మంచి చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25కు 25 లోక్‌సభ స్థానాలు గెలవడమే వైఎస్సార్‌సీపీ టార్గెట్. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో మళ్లీ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.