తెలంగాణ ఎన్నికలు: ప్రధాన పార్టీలు ఈ సారి వాటిపైనే ఆధారపడుతున్నాయా? | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికలు: ప్రధాన పార్టీలు ఈ సారి వాటిపైనే ఆధారపడుతున్నాయా?

Published Wed, Nov 22 2023 11:37 AM

Kommineni Analysis On Electoral Strategies Of Parties In Telangana - Sakshi

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సారి సానుకూల అంటే పాజిటివ్  ఓటింగ్ కన్నా, ప్రతికూల అంటే నెగిటివ్ ఓటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తుంది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు(బీజేపీ)లు అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని ఎన్నికల పోరు జరుపుతున్నాయి. బీఆర్ఎస్ పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు వంద నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేసుకుని విస్తృతంగా పర్యటనలు చేస్తుండగా, ఆయనకు అండగా మంత్రులు కేటిఆర్, హరీష్ రావులు ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నారు.

✍️కాంగ్రెస్‌కు సంబంధించి రాష్ట్ర నేతలలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారం చేస్తుండగా, జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే తదితరులు చాలెంజ్‌గా తీసుకుని తిరుగుతున్నారు. బీజేపీ పక్షాన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా ,గడ్కరి, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పార్టీ గ్రాఫ్ పెంచడానికి విపరీతంగా యత్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన వంతు పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతుండడం విశేషం.

✍️ఈ సందర్భంలో వీరు తమ  ప్రచార సభలలో ఎక్కువ శాతం తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామన్నదానిపై కాకుండా, ఎక్కువ భాగం ఎదుటి పార్టీల నెగిటివ్ ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు కనబడుతుంది. ప్రచార ప్రకటనలలో సైతం ఈ ధోరణి కనబడుతుంది. ఆసక్తికరంగా బీఆర్ఎస్ తన ప్రచార ప్రకటనలలో స్కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ అని చాలా పెద్ద అంకెను ఇచ్చి, పలు స్కామ్‌లను గుర్తు చేసే యత్నం చేసింది. 2014 ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. పైగా కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా అంత పవర్ ఫుల్ నేత ఇతర పార్టీలలో లేరన్న అభిప్రాయం కలిసి వచ్చింది.

✍️2018 ఎన్నికలలో టీఆర్ఎస్  అధికంగా పాజిటివ్ ఓటింగ్ పై ఆధారపడిందని చెప్పాలి. అప్పట్లో అమలు చేసిన రైతు బంధు స్కీమ్ వంటివి  బాగా ఉపయోగపడ్డాయి.. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలో సానుకూలతే ఉండడంతో ఇబ్బంది లేకుండా పోయింది. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితిలు కూటమి ఏర్పడడంతో వారికి వ్యతిరేకంగా సెంటిమెంట్‌ను ప్రయోగించడం కూడా ఉపయోగపడి ఉండవచ్చు. కాని తొమ్మిదిన్నరేళ్ల పాలన తర్వాత సహజంగానే ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత కొంత ఇబ్బంది పెడుతుంది. దానికి తోడు కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ క్యాడర్‌కు విశ్వాసం కల్పించడంలో  కొంతవరకు సఫలం అవుతున్నారు. అదే టైమ్‌లో కేసీఆర్ వ్యవహార శైలిపై వస్తున్న విమర్శలు ఆ పార్టీని కొంత ప్రభావితం చేస్తున్నాయి.

✍️కేసీఆర్‌ సచివాలయానికి రారని, ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలను కూడ కలవరని, ప్రజలకు అప్పాయింట్ మెంట్ పెద్దగా ఇవ్వరన్న విమర్శల ప్రభావం కూడా పనిచేస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన నష్టం బీఆర్ఎస్‌ను ఇరుకునపెడుతోంది. వివిధ కారణాల వల్ల కొద్ది మందికి మినహా ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు ఇవ్వడంతో వారిపై ఉన్న నెగిటివ్ కూడా చికాకు పెడుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన ప్రసంగాలలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూనే కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలకు దిగుతున్నారు.

✍️ప్రత్యేకించి నాలుగు దశాబ్దాల కింద ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ పాలనను ప్రస్తావించి ఆ పాలన ఆకలి రాజ్యమని, నక్సల్స్ తీవ్రవాదం ప్రబలిందని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పాలన వల్లే ఎన్.టి.ఆర్. పార్టీని స్థాపించి రెండు రూపాయలకు కిలో బియ్యం హామీతో అధికారంలోకి వచ్చి అమలు చేశారని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇందులో రెండు లక్ష్యాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం ఆగం అవుతుందని చెప్పడం, ఎన్.టి.ఆర్. పేరు ప్రస్తావించడం ద్వారా టీడీపీ మాజీ అభిమానులను ఆకర్షించడం. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే కరెంటు సరిగా రాదని, రైతు బంధు ఇవ్వరని ఇలా పలు వ్యతిరేకాంశాలను కేసీఆర్  ప్రజలకు చెబుతున్నారు.  బీజేపీపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, కాంగ్రెస్ పైన చేస్తున్నవాటితో పోల్చితే ఘాటు తక్కువే. బీజేపీ ప్రధాన ప్రత్యర్దిగా లేదన్న అభిప్రాయం ఏర్పడడమే దీనికి కారణం.

✍️ఎన్నికల మానిఫెస్టోల గురించి ఆయా పార్టీలు ప్రచారం చేస్తున్నా, ప్రధానంగా ప్రత్యర్ది పార్టీల నెగిటివ్ పాయింట్లను జనంలోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా పార్టీల ఎన్నికల మానిఫెస్టోలను అంత సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపించదు. కాంగ్రెస్ పార్టీ పలు ఎన్నికల హామీలు ఇచ్చినా, ప్రచార సభలలో బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే అత్యధిక ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ చేసిన ఇందిరమ్మ రాజ్యం అకలి రాజ్యం విమర్శలకు బదులు చెబుతూ కాంగ్రెస్ పాలనలోనే పలు ప్రాజెక్టులు వచ్చాయని, కేసీఆర్‌కు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా అవకాశం వచ్చిందని బదులు చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ఓటు వేయాలని కోరుతున్నారు. కేసీఆర్‌పై మాత్రం తీవ్రమైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

✍️కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి ఆలవాలమైందని, ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం అని, తాము అధికారంలోకి వస్తే కెసిఆర్ అవినీతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామని రేవంత్ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ను పోలిన బొమ్మలతో నేరుగా విమర్శలు చేస్తూ ప్రకటనలు ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆంక్షలు పెట్టడంతో ఆ ప్రకటనను విరమించుకోవల్సి వచ్చింది. కాంగ్రెస్ మానిఫెస్టోలో వివిధ గ్యారంటీల గురించి చెబుతున్నా, కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెంచడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

✍️భారతీయ జనతా పార్టీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో నెంబర్ వన్ అని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ స్కీమ్‌లలో వేల కోట్లు దారి మళ్లాయని, తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై విచారణ చేస్తామని ఆయన అన్నారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తన ప్రసంగాలలో కాళేశ్వరం గురించి ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వం డిజైన్‌లు మార్చిందని, దానిని చూస్తే దుఃఖం వస్తోందని సెంటిమెంట్ డైలాగు చెప్పారు. బీజేపీ తనకు బలం ఉన్న చోట కేంద్రీకరించి సభలు పెడుతోంది. తద్వారా తన ఉనికిని చాటుకోవడానికి కృషి చేస్తోంది. ఏది ఏమైనా ఈ ప్రధాన రాజకీయ పార్టీలు తమ మానిఫెస్టోలకన్నా, ప్రత్యర్ధుల బలహీనతలపైనే అధికంగా ఆధారపడి ఎన్నికల రాజకీయం చేస్తున్నాయి.


::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
Advertisement