ధనిక రాష్ట్రమైతే... ఆర్థిక దుస్థితి ఎలా వచ్చింది? 

Kishan Reddy Comments On Telangana Government - Sakshi

ప్రభుత్వం సమాధానం చెప్పాలి 

సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి 

గోల్కొండ అభివృద్ధికి జీఎంఆర్‌ ముందుకొచ్చింది 

ప్రతీ గ్రామ సమాచారం వెబ్‌సైట్‌లో మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్‌తో ఇతర రాష్ట్రాలకు అప్పులిచ్చే స్థాయిలో ఉన్నదని చెప్పిన ప్రభుత్వపెద్దలు ప్రస్తుత ఆర్థిక దుస్థితికి సమాధానమివ్వాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధిస్థాయి ఉన్న తెలంగాణను, ఆదిలాబాద్‌ స్థాయిలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోల్చలేం కదా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కిషన్‌రెడ్డి పైవిధంగా స్పందించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మొండిపట్టుదలకు పోకుండా, ఇతర శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లాలోని గండికోట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి దాల్మియా సంస్థతో కేంద్ర పర్యాటకశాఖ ఒప్పందం చేసుకుందని, ఢిల్లీలోని ఎర్ర కోటను అదే సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణలోని చారిత్రక గోల్కొండ కోటను జీఎంఆర్‌ సంస్థ సహకారంతో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. 

త్వరలో రామప్ప, గోల్కొండకు.. 
బుద్ధ భగవానుడిని కూడా చైనా తమ వాడిగా ప్రచారం చేసుకుని సొంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టేలా శాఖాపరంగా కార్యాచరణను చేపడుతున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలతోసహా దేశంలోని బౌద్ధక్షేత్రాలకు విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగేలా వచ్చే అక్టోబర్, నవంబర్‌లో అంతర్జాతీయ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే రామప్ప ఆలయం, గోల్కొండ కోట తదితర ప్రాంతాల్లో పర్యటించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వివరించారు. తెలంగాణలోని అనేక చారిత్రక కట్టడాలు, భవనాలను భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) పరిధిలోకి తెచ్చి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. వచ్చే ఏడాది ఆగస్టు 23 వరకు అంటే 75 వారాలపాటు జరగనున్న ‘ఆజాద్‌ కీ అమృత్‌ మహోత్సవ్‌’ఉత్సవాలకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోడల్‌ శాఖగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సర్పంచ్‌లు సిద్ధం కావాలని, గ్రామపంచాయతీ కమిటీలను నియమించుకుని ప్రతీ గ్రామ మ్యాపింగ్‌కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్క గ్రామంలోని సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉండేలా చర్యలు చేపడతామన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top