కేబినెట్‌లోకి కవిత: ఎవరికి చెక్‌పెడతారు..!

Kavitha May Join In KCR Cabinet Source - Sakshi

మంత్రివర్గంలోకి కవిత : ఇందూరు ఎమ్మెల్యేలు

సాక్షి, నిజామాబాద్ : ‌ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823ఓట్లకు గాను 728 ఓట్లను కైవసం చేసుకుని విపక్షాలను చిత్తు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోరపరాజయం పాలైన కవిత.. తాజా ఎన్నికతో ఓటమి చెందిన గడ్డపైనే గెలుపు జెండా ఎగరేశారు. సీఎం కేసీఆర్‌ కుమార్తె కావడంతో ఈ ఎన్నికను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేలంతా కవిత విజయం కోసం కృషి చేశారు. ఎన్నిక ఏకపక్షం కావడమే లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ దళం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను భారీగా చేర్చుకుంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ప్రయోగించి.. కమలాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. (ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం)

తనను ఓడించిన ఇందూరు నుంచి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. కవిత తాజా ఎన్నికతో తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. కవిత మండలి ఎన్నికపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేవలం 15 నెలల పదవీకాలం ఉన్న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి కవితను ఎంపిక చేయడం వెనుక రహస్యం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్థిస్థాయి మంత్రివర్గం కొలువుతీరి ఉన్న నేపథ్యంలో ఆమెను ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మంత్రివర్గంలో కేవలం 17 మందికే అవకాశం ఉంది. ఈ కోటా ఇప్పటికే పూర్తయ్యింది. ఒకవేళ కవితను కేబినెట్‌లోకి తీసుకోవాలంటే ఎవరోఒకరని తప్పించతప్పదు. ఆ సాహసం ఎవరు చేస్తారు..? సీఎం ఎవరిపై వేటు వేస్తారు? అనేది తెలియాల్సి ఉంది. (ఎమ్మెల్సీగా ఉంటారా.. మంత్రివర్గంలో చేరతారా?)

సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు కవిత కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ ఒక్కరిని తప్పించినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోక తప్పదు. నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న సమయంలోనే కేంద్రమంత్రి పదవి కోసం ప్రయత్నించిన కేసీఆర్‌ ప్రయత్నాలు విఫలం కావడంతో.. తాజాగా మండలికి ఎంపిక చేసి రాష్ట్ర కేబినెట్‌లో చోటుకల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో అవకాశం లేకపోతే కేబినెట్‌ హోదా కల్పించి వేరే ఇతర బాధ్యతలు అప్పగిస్తారనే చర్చకూడా తెరపైకి వచ్చింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీగాల గణేష్‌ గుప్తా, షకిల్‌, జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆరేళ్ళ కాలపరిమితి గల ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరిలో ముగియనుంది. అప్పటి వరకు కవిత ఎమ్మెల్సీగానే కొనసాగుతురా? లేక మంత్రివర్గంలో చేరతారా అనేది తెలియాల్సి ఉంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top