టీఆర్‌ఎస్‌ గూటికి కౌశిక్‌రెడ్డి

Kaushik Reddy To Join TRS In the presence of CM KCR Today - Sakshi

నేడు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో చేరిక 

2018లో నన్ను చంపేందుకు ఈటల కుట్ర పన్నారు: కౌశిక్‌ 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తన అనుచరులతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. నియోజకవర్గానికి చెందిన అనుచరులతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకునేలా కౌశిక్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై పోటీ చేసిన కౌశిక్‌ 60వేల పైచిలుకు ఓట్లను సాధించారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఈటల నిష్క్రమణ, హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక తదితర పరిణామాల నేపథ్యంలో కౌశిక్‌ టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరిగింది. తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కొందరితో ఫోన్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వారం క్రితం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. కౌశిక్‌ ఈ నెల 16న టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా అదే రోజు టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరడంతో కౌశిక్‌ చేరిక వాయిదా పడింది. టీఆర్‌ఎస్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో బుధవారం ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. 

ఈటలవి హత్యా రాజకీయాలు: కౌశిక్‌రెడ్డి 
‘ఈటల గెలుపు ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతుంది. టీఆర్‌ఎస్‌తోనే హుజూరాబాద్‌ అభివృద్ధి సాధ్యమవుతుంది. 18 ఏళ్లపాటు ఈటలను గెలిపించిన ఓటర్లు వచ్చే రెండేళ్ల కోసం టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేయకపోతే 2023లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకండి. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత నాదే’అని కౌశిక్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘హత్యా రాజకీయాలు చేయడంలో ఈటల రాజేందర్‌ది అందె వేసిన చేయి. 2018 ఎన్నికల సందర్భంగా కమలాపూర్‌ మండలం మర్రిపల్లి వద్ద నన్ను చంపేందుకు కుట్ర పన్నాడు. మాజీ ఎంపీటీసీ బాలరాజును 2014 ఎన్నికల సందర్భంగా హత్య చేయించారు’అని కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే వస్తుందని భావిస్తున్నా. ఒకవేళ రాకున్నా ఈటల ఓటమి లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం మేరకు పనిచేస్తా’అని కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top