సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
4,01,365 మంది ఓటర్లు...
జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశాం. మూడంచెల భద్రత ఉంటుంది. 45 FST, 45 SST టీమ్స్ నియోజకవర్గం లో పని చేస్తున్నాయి. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.
పారా మిలిటరీ బలగాలు..
‘‘561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల క్యూ మెయింటెన్ చేయడానికి NCC వాలంటీర్లు పని చేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
..అక్కడ పారామిలిటరీ బలగాలు బందోబస్తులో ఉంటాయి. డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తాం. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే అంశంపై ఆర్‌బీఐతో మీటింగ్ పెట్టాం. ఆర్‌బీఐ మానిటరింగ్ ఉంటుంది. ఇప్పటినుంచి 11 సాయంత్రం వరకు వైన్ షాప్‌లు క్లోజ్ ఉంటాయి. ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవాలి’’ అని ఆర్వీ కర్ణన్ తెలిపారు.
226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు..
హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. 65 లొకేషన్స్ లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారా మిలిటరీ బలగాలు ఉంటాయి. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుంది. ఎన్నికల ఉల్లంఘన కేసులు 27 నమోదయ్యాయి. ఇప్పటివరకు 3 కోట్ల 60 లక్షల నగదు పట్టుకున్నాం. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. ఇప్పటివరకు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఘటనలు జరగలేదు. 230 రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశాం. 1,761 లోకల్ పోలీసులు బందోబస్తులో ఉంటారు. 8 కంపెనీల CISF బలగాలు బందోబస్తులో ఉంటాయి
కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేశాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తించాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్‌ఎస్‌ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజావ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజులపాటు నియోజకవర్గమంతా చుట్టేయడం ఈ ఉపఎన్నిక తీవ్రతకు అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులకు సైతం డివిజన్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో తలమునకలవడం చూస్తే ఈ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.


