
సాక్షి, హైదరాబాద్: తమకు మంచి రోజులు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటమి తప్పదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
మళ్లీ మాకు మంచి రోజులు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అన్ని పనులు ఆగిపోయాయి. హైడ్రా పేరిట శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. కాబట్టి ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీఆర్‌ఎస్ విజయం తథ్యం..
.. గులాబీ దండు జైతయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం అవుతుంది. కేసీఆర్ పునరాగమనానికి ఇదే తొలి మెట్టు. ప్రజల దీవెనలు బీఆర్‌ఎస్‌కే ఉంటాయని ఆశిస్తున్నాం. మాగంటి సునీత గెలుపునకు బీఆర్‌ఎస్ సమిష్టిగా కృషి చేస్తుంది అని కేటీఆర్ అన్నారు.
నామినేషన్ వేసిన సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు ఉన్నారు. పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని, బీఆర్‌ఎస్ గెలిస్తే బుల్డోజర్ అరాచకాలకు పుల్‌స్టాప్ పడ్డట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: వీడిన సస్పెన్స్.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?