
ఈ నెల 16, 17, 18వ తేదీల్లో దశమి.. ఏకాదశి.. ద్వాదశి... నామినేషన్లు భారీగా పడే అవకాశం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా అభ్యర్థులు నమ్మే స్వాములు, పంచాంగ కర్తలు వారి జాతకం, నక్షత్రం ప్రకారం ఏ రోజు, ఏ సమయంలో వేస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకొని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆయా స్వామీజీలు, పంచాంగకర్తలు, జ్యోతిషులు బిజీబిజీగా మారి వారికి తగు సలహాలు, సూచనలు, ఏదైనా సమస్య ఉండే దానికి చేయాల్సిన పరిహారాలు కూడా చెబుతున్నారు. కొందరు నేతలు మా అభ్యర్థే గెలవాలని పూజలు, హోమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
దాదాపు వందల దాకా నామినేషన్లు పడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం విశేషం. అయితే.. 16, 17, 18 తేదీల్లో దశమి, ఏకాదశి, ద్వాదశి మంచి రోజులు కావడంతో ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అధికంగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ నెల 17న నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ బుధవారం కొందరు నేతలతో కలిసి నామమాత్రపు నామినేషన్ వేసి, 18వ తేదీలోపు పార్టీ క్రియాశీల నేతలతో కలిసి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.