ఎన్డీయే సర్కార్‌కు ‘అగ్ని’పరీక్ష తప్పదా? | JDU wants modifications in Agniveer scheme | Sakshi
Sakshi News home page

ఎన్డీయే సర్కార్‌కు ‘అగ్ని’పరీక్ష తప్పదా?

Jun 6 2024 3:03 PM | Updated on Jun 6 2024 3:08 PM

JDU wants modifications in Agniveer scheme

న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇంకా కొలువు దీరలేదు. ఈలోపే మిత్రపక్షాల నుంచి డిమాండ్లు మొదలవుతున్నాయి. అయితే అవి కేబినెట్ కూర్పు విషయంలోనే కాదులేండి.

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎన్డీయే మిత్రపక్షం జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) ఇప్పుడు కోరుతోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ ఈ స్వరం వినిపించారు. ’’అగ్నిపథ్ పథకం మీద దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ పథకం తెచ్చినప్పుడు సైన్యం వర్గాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. 

.. వాళ్ల కుటుంబాలు కూడా రోడ్డెక్కి పోరాటం చేశాయి. ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. కాబట్టి, దానిని కచ్చితంగా సమీక్షించాల్సిందే. ఈ ప‌ధ‌కంపై ప్ర‌జ‌లు లేవనెత్తిన లోటుపాట్ల‌ను వివ‌రంగా చ‌ర్చించి వాటిని చ‌క్క‌దిద్దాల‌ని మా పార్టీ కోరుకుంటోంద‌ని చెప్పారు.‘‘ అని కేసీ త్యాగి అన్నారు.

ఇక.. ఉమ్మ‌డి పౌర‌స్మృతిపై పార్టీ అధ్య‌క్షుడి హోదాలో బిహార్ సీఎం నితీష్ కుమార్ లా క‌మిష‌న్ చీఫ్‌కు లేఖ రాసిన సందర్భాన్ని కూడా త్యాగి గుర్తుచేశారు. తాము ఉమ్మ‌డి పౌర‌స్మృతికి వ్య‌తిరేకం కాద‌ని, అయితే యూసీసీపై ప్ర‌భావిత‌మయ్యే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో చ‌ర్చించి ఓ పరిష్కారం అన్వేషించాల‌ని త్యాగి పేర్కొన్నారు.

రెండేళ్ల కిందట.. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం గత ఎన్డీయే హయాంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ‘అగ్నిపథ్‌’. అయితే నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసు అంశంపై ఆ సమయంలోనే తీవ్ర దుమారం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబిక్కాయి. మరోవైపు ప్రతిఏపక్షాలు సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ.. అగ్నివీర్‌ పథకం ద్వారా అగ్నీవీర్‌లను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగిస్తూ వస్తున్నారు. 

తాజాగా.. ఇండియా కూటమిలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సైతం అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేయాల్సిందేననే గళం బలంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆ తప్పిదాన్ని ఒప్పుకుని.. వెంటనే దానిని రద్దు చేయాలని కోరుతున్నారాయన. 

కిందటి నెలలో భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ అగ్నిపథ్‌ పథకానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వెలిబుచ్చారు. 

అయితే ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్‌/అగ్నిపథ్‌ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ ఏడాది మార్చిలో ఒక ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్‌ ఇది ఎన్నికల జిమ్మిక్కు అంటూ మండిపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement