కారెక్కనున్న రమణ?

Hyderabad: Telangana Tdp Presdient L Ramana Join In Trs Party  - Sakshi

టీఆర్‌ఎస్‌లో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి చేరికకు రంగం సిద్ధం 

ఎర్రబెల్లి మధ్యవర్తిత్వం .. కేటీఆర్‌తో చర్చలు 

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం 

ఈటల నిష్క్రమణ నేపథ్యంలో రమణ చేరికకు ప్రాధాన్యత

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) ఇటీవలే అధికార టీఆర్‌ఎస్‌ పక్షంలో విలీనం కాగా, ఎల్‌.రమణ కూడా గుడ్‌బై చెబితే రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైనట్టేనని చెప్పవచ్చు. టీఆర్‌ఎస్‌లో చేరికకు సంబంధించి పార్టీ నేతలు కొందరు రమణతో కొంతకాలంగా మంతనాలు సాగిస్తున్నారు. అయితే, తాజాగా ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

అధినేత కేసీఆర్‌ పచ్చజెండా 
టీఆర్‌ఎస్‌లో రమణ చేరికకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. పార్టీలోకి రావాల్సిందిగా ఎల్‌.రమణకు గతంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ నుంచి ప్రతిపాదన వెళ్లింది. అయితే తాజాగా మరోసారి రమణను టీఆర్‌ఎస్‌ గూటికి చేర్చే బాధ్యతను ఎర్రబెల్లి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో రమణ మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు త్వరలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రమణ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు రెండు మూడురోజుల్లో హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత రమణ చేరిక ప్రక్రియ ఊపందుకోనుంది. రమణ చేరికకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది.  

కలిసిరానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు 
ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఈ నెల 3న ఖాళీ అయినా.. కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఖాళీ అయ్యే స్థానాల్లో పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తామని గతంలో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశించిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ ఇటీవల తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా నియమి తులయ్యారు. మరో నేత, మాజీ ఎంపీ గుండు సుధారాణి వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇదే సామాజికవర్గానికి చెందిన ఎల్‌.రమణను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవిని అప్పగిస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు సమాచారం.   

చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్‌ వెంటే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top