టీడీపీ కంచు కోటలకు తూట్లు

Huge Defeat For TDP In first phase panchayat elections of AP - Sakshi

తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం 

పార్టీ ఎమ్మెల్యేలున్న చోట్ల కూడా టీడీపీ మద్దతుదారుల ఓటమి 

అచ్చెన్నాయుడు, యనమల, దేవినేని ఉమా, లోకేష్‌కు ఎదురుదెబ్బ 

సొంత నియోజకవర్గాల్లో జీరోలైన ‘హీరోలు’

సాక్షి, అమరావతి: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో.. తమకు కంచుకోటలుగా భావించే గ్రామాల్లో సైతం టీడీపీ మద్దతుదారులు ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనంలో సైతం గెలిచిన నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ ఇప్పుడు మట్టికరిచింది. 

యనమల చతికిల
టీడీపీ అపర మేధావిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు తమ్ముడు ఇన్‌ఛార్జిగా ఉన్న తుని నియోజకవర్గం తొండంగి మండలం ఏవీ నగరంలో స్వయాన యనమల అన్న కొడుకు యనమల శ్రీను టీడీపీ మద్దతుదారుగా పోటీ చేసి ఓడిపోయారు. తుని నియోజకవర్గంలో 58 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. 54 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుపొందారు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీ చేతిలో ఉన్న కోదాడ, పెరుమాళ్లపురం పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుపొందడం గమనార్హం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో 135 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 112 పంచాయతీలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు.  

40 ఏళ్ల నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న కోటబొమ్మాళి మేజర్‌ పంచాయతీలో ఈసారి వైఎస్సార్‌సీపీ అభిమాని పాగా వేశారు. అలాగే 37 సంవత్సరాలుగా టీడీపీ చేతిలో ఉన్న సంతబొమ్మాళి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభిమాని కళింగపట్నం లక్ష్మి గెలవడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 41 పంచాయతీలకు 34 పంచాయతీలను వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుచుకోగా కేవలం ఐదు చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు అతికష్టం మీద గెలవగలిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న జె తిమ్మాపురం, కట్టమూరు, వేట్లపాలెం, మేడపాడు, ఆర్వీపట్నం, ఆర్‌వి కొత్తూరు మేజర్‌ పంచాయతీలను ఈసారి వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుచుకున్నారు.

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలో 52 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఏడు పంచాయతీలకే టీడీపీ మద్దతుదారులు పరిమితమయ్యారు. 39 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిచారు. గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గంలో 44 పంచాయతీల్లో 39 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలవగా, జనసేన మద్దతుదారులు కేవలం మూడు పంచాయతీల్లో టీడీపీ మద్దతుతో అతి కష్టం మీద గెలిచారు.  మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్‌ఛార్జిగా ఉన్న మైలవరం నియోజకవర్గంలో 48 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఖాతాలోకే వెళ్లాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. టీడీపీకి పట్టుకొమ్మగా ఉన్న మైలవరం మేజర్‌ పంచాయతీని తొలిసారిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు చేజిక్కించుకున్నారు. 

లోకేష్‌కు మళ్లీ భంగపాటు
ఏ ప్రత్యక్ష ఎన్నికలోనూ గెలవలేక కేవలం ట్వీట్లతో కాలక్షేపం చేసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేష్‌ తాను ఇన్‌ఛార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి కూడా భంగపాటుకు గురయ్యారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆ నియోజకవర్గంలోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 14 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే విజయం సాధించారు. టీడీపీ మరో ముఖ్య నేత ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ ఎమ్మెల్యేలు రామరాజు, బాలవీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావులు కూడా తమ నియోజకవర్గాల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న విజయవాడ రూరల్‌ మండలంలో 9 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిచారు. ఇక్కడ టీడీపీ తరఫున వల్లభనేని వంశీ గెలుపొంది ఆ తర్వాత ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top