
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ నయమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. రాష్ట్రంలో కేఏ పాల్ 175 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారని.. పవన్ కూడా 175 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం నోవాటెల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జనసేన కార్యకర్తలు పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే.. ఆయన మాత్రం చంద్రబాబును సీఎం చేసేందుకు రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు జనసైనికులు బానిసలుగా బతకాలన్నారు.
పవన్.. వంగవీటి గురించి మాట్లాడిన మాటలు, ఆయనను హత్య చేసిన వారిని కౌగిలించుకున్న విషయాలను ఎలా చూడాలని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అమరావతి రైతులు పాదయాత్ర మానుకోవాలని కోరారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. నగరంలోని ఒక హోటల్లో మంగళవారం అసోసియేషన్ ఆఫ్ లేడి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా 100 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.