మాది డీబీటీ.. బాబుది డీపీటీ

Gudivada Amarnath Fires On Chandrababu - Sakshi

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నా«థ్‌ 

బాబు అంటే వెన్నుపోటు, వంచన, మోసం, దగా 

మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.లక్షా 15 వేల కోట్లు మాత్రమే 

ఈ విషయాన్ని కాగ్‌ స్వయంగా స్పష్టం చేసింది 

రూ.8 లక్షల కోట్లు అన్నది బాబు అక్కసు మాత్రమే

సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుత ప్రభుత్వం డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా సంక్షేమ పథకాలతో పేదలకు మేలు చేస్తుంటే.. టీడీపీ ప్రభుత్వంలో డీపీటీ (దోచుకోవడం, పంచుకోవడం, తినడం) కోసమే చంద్రబాబు అప్పులు చేశారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. శనివారం సర్క్యూట్‌ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని అక్కసుతో చెబుతున్నాడన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.లక్షా 15 వేల కోట్ల అప్పు చేసినట్లు స్వయాన కాగ్‌ నివేదికలో పేర్కొందని చెప్పారు. ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వం రూ.1.65 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు లబ్ధి కలిగించిందని తెలిపారు. బాబు పాలనలో చంద్రబాబుతో కూడిన దుష్టచతుష్టయం, జన్మభూమి కమిటీలు దోచుకుతిన్నాయన్నారు. అసలు.. వడ్డీ బాబు హయాంలో పెరిగినంతగా ఎప్పుడూ పెరగలేదన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. 

జీవోలివ్వడం తప్ప  బాబు చేసింది శూన్యం  
► హుద్‌హుద్‌ తుపాను సమయంలో మొత్తం రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు స్వయాన ఎల్లో మీడియానే రాసింది. అప్పుడు పాచిపోయిన పులిహోర తప్ప బాబు పంచింది ఏమీ లేదు. కానీ తానేదో ఉద్ధరించినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు. బాబు విడుదల చేసిన జీవో ఎక్కడా.. ఎప్పుడూ అమలు కాలేదు.  
► హుద్‌హుద్‌ ప్రభావ ప్రాంతంలో మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 11 రోజులు పర్యటిస్తే.. ఒక్కరు కూడా సాయం అందిందని చెప్పలేదు. ఇందుకు నేనే సాక్ష్యం. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు ఇస్తే.. సగానికి సగం తినేశారు. భారీగా విరాళాలు కూడా వసూలు చేశారు. ఆ విరాళాలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు వెళ్లాయా? లేక నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లాయా? అన్నది స్పష్టం చేయాలి. 

జిల్లాల విభజనతో పెరిగిన పర్యవేక్షణ  
► గోదావరి వరద విపత్తుకు గురైన ఆరు జిల్లాల్లో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం కాపాడింది. జిల్లాల పునర్విభజన కారణంగా 13 జిల్లాలు 26 అయ్యాయి. కలెక్టర్‌లు, జాయింట్‌ కలెక్టర్‌లు, ఎస్పీలు పెరిగారు. సచివాలయ వ్యవస్థ సమర్థవంతంగా వ్యవహరించింది. ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.2 వేలు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరకులను అందజేసింది. వరద నష్టాన్ని ఎన్యూమరేషన్‌ చేసి మరో రెండు నెలల్లో సహాయం అందిస్తాం. తక్షణ ఆర్థిక సహాయంగా రూ.20 వేల కోట్లు అందించాం.   
► ఈరోజు ఇంటర్నేషనల్‌ ఫ్రెండ్‌ షిప్‌డే సందర్భంగా చంద్రబాబు ఫ్రెండ్స్‌ ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు, దత్తపుత్రుడు.. వీరితో పాటు  వెన్నుపోటు, వంచన, మోసం, దగా అనే మరో నలుగురు స్నేహితులు మరోమారు చేతులు కలిపారు.   

చెప్పిందే చేస్తున్నాం.. 
బెల్ట్‌ షాపులను దశల వారీగా తగ్గిస్తాం. బార్, రెస్టారెంట్, హోటల్స్‌లో మద్యం ధరలు పెంచుతాం. అప్పుడు డబ్బున్న వారే మద్యం తాగుతారు. మద్యం తాగాలంటే షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతాం అని చెప్పాం. అదే పని చేశాం. ఇప్పుడు కొత్తగా బార్ల సంఖ్యను పెంచలేదు. పాత బార్లకు లైసెన్స్‌ల గడువు పూర్తయినందున తిరిగి కొత్తగా ఇస్తున్నాం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top