
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కాం కేసు ఎదుర్కొంటున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులో తనను అక్రమంగా ఇరికించారని మీడియా ముందు వాపోయారాయన. ఈ కేసులో సిట్ కస్టడీకి తరలించే క్రమంలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు.
‘‘నాపై తప్పుడు కేసులు పెట్టారు. అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు’’ అని అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు ఆయన్ని బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నేటి(జులై 1వ తేదీ) నుంచి చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని సిట్ మూడు రోజులపాటు విచారించనుంది.
విచారణకు ముందు జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు.
