గెలిచినా సంతోషం లేదంటున్న బీజేపీ అభ్యర్థి

Goa Election 2022 Result: Atanasio Monserrate Not Satisfied With Result - Sakshi

పణజి: గెలిచినా సంతోషం లేదంటున్నారు బీజేపీ అభ్యర్థి అటానాసియో మోన్‌సెరెట్టే. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావించిన పణజి నియోజవర్గం నుంచి 716 స్వల్ప ఆధిక్యతతో ఆయన గెలిచారు. ఇక్కడి నుంచి స్వతంత్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్పల్‌ పారికర్‌.. అటానాసియోకు గట్టిపోటీ ఇచ్చారు. ‘బాబూష్’గా పాపులర్‌ అయిన అటానాసియోకు 6787 ఓట్లు, ఉత్పల్‌కు 6071 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎల్విస్ గోమ్స్ కు 3175 ఓట్లు దక్కాయి.

అతి తక్కువ ఆధిక్యంతో గెలవడం పట్ల అటానాసియో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ ఫలితం నాకు చాలా అసంతృప్తి కలిగించింది. చాలా మంది హార్డ్‌కోర్ బీజేపీ ఓటర్లు ఉత్పల్‌కు ఓటు వేశారు. అందుకే ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయి. స్థానిక బీజేపీ నాయకుల్లో కొందరు నాకు సహకరించలేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పాను. రాష్ట్ర బీజేపీ విభాగం కార్యకర్తలకు సరైన సందేశం ఇవ్వలేదు. దీంతో నాకు నష్టం జరిగింది. నిజం చెప్పాలంటే నేను బీజేపీ, కాంగ్రెస్‌తో పోరాడాను. నన్ను అభిమానించే కొంతమంది మద్దతుదారుల సహాయంతోనే మేము సీటును నిలబెట్టుకోగలిగామ’ని ఆయన వాపోయారు.

గోవాలో కచ్చితంగా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అటానాసియో దీమా వ్యక్తం చేశారు. ప్రమోద్ సావంత్ తమ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాగా, అటానాసియో సతీమణి జెన్నిఫర్‌ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం.  (క్లిక్‌: గోవాలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top