సిద్దిపేట ముద్దుబిడ్డ, ఐదుసార్లు అక్కడి నుంచే | Former MP Nandi Yellaiah Political History | Sakshi
Sakshi News home page

సిద్దిపేట ముద్దుబిడ్డ, ఐదుసార్లు అక్కడి నుంచే

Aug 8 2020 3:54 PM | Updated on Aug 8 2020 4:16 PM

Former MP Nandi Yellaiah Political History - Sakshi

ఆరు సార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరు గడించారు.

సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు కడవరకూ కట్టుబడి నడుచుకున్న సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య (78) ఇకలేరు. 10 రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆరు సార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరు గడించారు. 1942 జూలై 1న హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఆయన జన్మించారు. నంది ఎల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

ప్రస్థానమిలా
సిద్దిపేట నుంచి 1977 లో మొదటి సారి సిద్దిపేట (ఎస్సీ) లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి నంది ఎల్లయ్య గెలుపొందారు. అప్పటి వరకు సిద్దిపేట ఎంపీగా పని చేసిన జి.వెంకటస్వామి శాసనమండలికి వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దాంతో సిద్దిపేట పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నంది ఎల్లయ్య పోటీ చేసి గెలిచారు. 1980లో జనతా ప్రభుత్వం కూలిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సిద్దిపేట నుంచి మళ్లీ పోటీ చేసి ఆయన గెలుపొందారు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గుండె విజయరామారావు చేతిలో నంది ఎల్లయ్య ఓడిపోయారు. తిరిగి 1989లో విజయరామమారావును ఓడించి మూడవ సారి విజయం సాధించారు. 

ఎన్టీఆర్ ఛైర్మన్‌గా వ్యవహరించిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోవడంతో 1991లో  జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నంది ఎల్లయ్య సిద్దిపేట నుంచి నాలుగో సారి గెలిచారు. 1996లో  మెజారిటీ లేక పోవడంతో అప్పటి ప్రధాని వాజ్ పాయ్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో నంది ఎల్లయ్య ఐదో సారి సిద్దిపేట నుంచి గెలిచారు. 1998లో వాజ్‌పేయి  ప్రభుత్వం మళ్లీ పడిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి పోటిచేసిన నంది ఎల్లయ్య మందా జగన్నాథాన్ని ఓడించి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ముఖ్య అనుచరుడిగా  నంది ఎల్లయ్య కొనసాగారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. 
(కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement