బెంగాల్‌ ఎన్నికలు రక్తసిక్తం

Five killed during West Bengal election violence - Sakshi

రెండు ఘటనల్లో ఐదుగురి మృతి

కూచ్‌బెహార్‌ జిల్లా సితాల్‌కుచీ నియోజకవర్గంలో దారుణం 

భద్రతా సిబ్బందిపై అల్లరి మూక దాడి.. తుపాకులు లాక్కొనేందుకు యత్నం

ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు

నలుగురి మృతి.. వారు మా మద్దతుదారులే: తృణమూల్‌ కాంగ్రెస్‌

మరో ఘటనలో యువ ఓటర్‌ను కాల్చి చంపిన దుండగులు

సితాల్‌కుచీ/సిలిగురి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అతిపెద్ద హింసాకాండ శనివారం చోటుచేసుకుంది. కూచ్‌బెహార్‌ జిల్లాలో రెండు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూచ్‌బెహార్‌ జిల్లా సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలోని మాతాభంగా పోలింగ్‌ కేంద్రం వద్ద శనివారం ఉదయం 9.40 గంటలకు కాల్పులు జరిగాయి. ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాల నుంచి తుపాకులు లాక్కొనేందుకు స్థానికులు ప్రయత్నించారని, దాడికి దిగారని పోలీసు అధికారులు చెప్పారు. ఆత్మరక్షణ కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మృతులు తమ పార్టీ మద్దతుదారులని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొంది.

క్యూఆర్‌టీ వాహనం ధ్వంసం
ఓట్లు వేయడానికి వచ్చినవారిపై తొలుత కొందరు రాళ్లు రువ్వారని, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారని తెలిపారు. కేంద్ర బలగాలకు చెందిన క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌(క్యూఆర్‌టీ) వాహనాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గలేదని, భద్రతా సిబ్బందిపైకి దూసుకొచ్చారని, తుపాకులు లాక్కొనేందుకు ప్రయత్నించారని వివరించారు. ఆత్మరక్షణతోపాటు పోలింగ్‌ బూత్‌ను, ఎన్నికల సిబ్బందిని రక్షించడానికి అల్లరి మూకపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారన్నారు. నలుగురు మరణించగా, మరో నలుగురికి బుల్లెట్‌ గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఈ మొత్తం ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4 మృతదేహాలను అధికారులు సమీప ఆసుపత్రికి తరలించారు.

మరో ఘటనలో ఓటర్‌ కాల్చివేత
కూచ్‌బెహార్‌ జిల్లాలో సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలో శనివారం ఉదయం మరో దారుణం చోటుచేసుకుంది. మొదటిసారి ఓటు వేసేందుకు వచ్చిన ఆనంద బర్మన్‌(18)ను పఠాన్‌తులీలో 85వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌ బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో బర్మన్‌ మరణించాడు.

126/5 బూత్‌లో పోలింగ్‌ నిలిపివేత
సితాల్‌కుచీ నియోజకవర్గంలోని 126/5 పోలింగ్‌ బూత్‌ వద్ద కాల్పులు జరగడం, నలుగురు మరణించడంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ వెంటనే పోలింగ్‌ను నిలిపివేశారు. రీపోలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర బలగాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయన్న పుకారు కార్చిచ్చులా వ్యాపించడంతో దా దాపు 400 మంది వెంటనే 126/5 పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్నారని, కేంద్ర జవాన్లను ఘెరావ్‌ చేశారని కూచ్‌బెహార్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నిజానికి పోలింగ్‌ బూత్‌ వద్ద ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోతే భద్రతా సిబ్బంది సపర్యలు చేశారని అన్నారు. కానీ, అతడిని కాల్చి చంపారని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.

టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు
ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో పలు చోట్ల టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దిన్హతా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్‌ గుహపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన గాయాలపాలయ్యారు. బెహలా పూర్బా స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి పాయల్‌ సర్కారు కారుపై అల్లరి మూక దాడికి పాల్పడింది. వారి బారి నుంచి ఆమె క్షేమంగా తప్పించుకున్నారు. బీజేపీ ఎంపీ లాకెట్‌ చటర్జీపైనా టీఎంసీ మద్దతుదారులు దాడికి దిగారు. హుగ్లీ జిల్లాలోని చుచురాలో ఆమె కారును ధ్వంసం చేశారు. హౌరా జిల్లాలోని బాల్లీలో బీజేపీ అభ్యర్థి బైశాలీ దాల్మియా కాన్వాయ్‌పై టీఎంసీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కోల్‌కతాలో బీజేపీ అభ్యర్థి ఇంద్రనీల్‌ ఖాన్‌ను టీఎంసీ శ్రేణులు ఘెరావ్‌ చేశాయి. జాదవ్‌పూర్‌లో సీపీఎం ఏజెంట్‌పై కొందరు దుండగులు కారం పొడి చల్లి దాడి చేశారు. బంగోర్‌ నియోజకవర్గంలో ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్, టీఎంసీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది.  

ఇప్పటిదాకా 8 మంది అరెస్టు
కూచ్‌బెహార్‌ జిల్లాలో రెండు హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి అరీఫ్‌ అఫ్తాబ్‌ చెప్పారు. రెండు ఘటనలపై కూచ్‌బెహార్‌ జిల్లా కలెక్టర్, ఎస్పీ నుంచి నివేదికను కోరినట్లు తెలిపారు. సితాల్‌కుచీ అసెంబ్లీ స్థానం పరిధిలో జోర్‌పాట్కీ పోలింగ్‌ బూత్‌ వద్ద రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొందన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగాయన్నారు. పఠాన్‌తులీలో యువకుడిని కాల్చి చంపిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

నాలుగో దశలో 76.16 శాతం ఓటింగ్‌
పశ్చిమ బెంగాల్‌లో నాలుగో దశలో 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి.  సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. 15,940 పోలింగ్‌ కేంద్రాల్లో జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర బలగాలను, పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తున్నారన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపణలపై ఈసీ స్పందించింది. ప్రిసైడింగ్‌ అధికారి సూచిస్తే తప్ప పోలింగ్‌ బూత్‌ల్లోకి వెళ్లొద్దని కేంద్ర బలగాలకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది. కూచ్‌బెహార్‌ జిల్లాలో అశాంతి తలెత్తకుండా రాజకీయ నాయకుల ప్రవేశంపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాబోయే 72 గంటల వరకూ ఎవరూ జిల్లాలో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఐదో దశ ఎన్నికల్లో ‘సైలెన్స్‌ íపీరియడ్‌’ను 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది.  

అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలు
బెంగాల్‌లో మరో నాలుగు దశల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. శనివారం కూచ్‌బెహార్‌ జిల్లాలో మూడో దశ ఎన్నికల సందర్భంగా హింస చోటుచేసుకోవడం, నలుగురు మరణించడంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమయ్యింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు బెంగాల్‌కు అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 1,000 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నాయి.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top