పది లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డా అని అన్నారు: ఈటల భావోద్వేగం

Etela Rajender Comments On Huzurabad Bypoll - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కేసీఆర్‌ అహంకారంపై ఇది తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారు. హుజూరాబాద్‌ ప్రజలను ప్రలోభాలకు గురిచేయాలని చూశారు. చివరకు హుజూరాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారు. ఎన్ని చేసినా ప్రజలు నా వైపు నిలబడ్డారు.

చదవండి: (హుజూరా‘బాద్‌’షా ఈటలే)

కుల సంఘాలతో అందరికీ డబ్బులిచ్చారు.. అయినా ఎవరూ లొంగలేదు. మేము దళిత బస్తీలకు పోయినపుడు దళిత బంధకు లొంగిపోతామా బిడ్డా అని చెప్పారు. మేం పది లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డా అని అన్నారు. కుల ప్రస్తావన తెచ్చినా ప్రజలు నా వైపే నిలబడ్డారు. ఈ విజయం హుజూరాబాద్  ప్రజలకు అంకితం. హుజూరాబాద్‌ ప్రజల రుణం తీర్చుకోలేనిది. నా చర్మం ఒలిచి, వాళ్లకి చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను. నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా.

నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు. కుట్రదారుడు కుట్రలలోనే నాశనం అయిపోతాడు. 2 గుంటల మనిషి 4 వందల కోట్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడు?. కేసీఆర్‌ మొహంతో కంటే ఇప్పుడు ఎక్కువ  ఓట్లు వచ్చాయి. నేను పార్టీలు మారినవాడిని కాదు. నా చరిత్ర తెరిచిన పుస్తకం. నాకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు, నా గెలుపుకు కృషి చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు. నాకు అండగా ఉన్న అమిత్‌ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని ఈటల రాజేందర్‌ అన్నారు. 

చదవండి: (Etela Rajender: బాగారెడ్డి రికార్డు సమం.. ఈటలకు అడ్డురాని 7వ నంబర్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top