అవినీతి అంతం కావాలి

Dr Shravani joined BJP - Sakshi

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే  తెలంగాణలో అభివృద్ధి సాధ్యం 

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం 

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ 

బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో గత ఎనిమిదిన్నరేళ్లుగా జరుగుతున్న అవినీతి అంతం కావాలంటే రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. ఇప్పటికే తెలంగాణలోని యువత, ఉద్యోగులు, రైతులు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఏకమవుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో మార్పు కోరుతూ బీజేపీ ముందుకు దూసుకెళ్తోందని.. త్వరలోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి సమక్షంలో జగిత్యాల మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డా.శ్రావణి సహా పలువురు బీజేపీలో చేరారు. డీకే అరుణ పార్టీ కండువా కప్పి శ్రావణిని పార్టీ లోకి ఆహ్వా నించగా, భూపేంద్ర యాదవ్‌ పార్టీ సభ్యత్వ రశీదును అందించారు.

అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆత్మగౌరవం కోసం డా.శ్రావణి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఎంతో అభినందనీయమన్నారు. 

మోదీ సైన్యంలో సైనికురాలిగా పనిచేస్తా 
డా.శ్రావణి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ఆకర్షితురాలినై బీజేపీలో చేరానన్నారు. జగిత్యాల జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మోదీ సైన్యంలో ఒక సైనికురాలిగా పనిచేసేందుకు సిద్ధమయ్యానని చెప్పారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. డీకే అరుణ మాట్లాడుతూ బీజేపీలో పెద్ద నాయకులు, చిన్న నాయకులు అనే తేడా ఏదీ లేదని, ప్రజలతో మమేకమై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న అందరినీ బీజేపీ గుర్తిస్తుందని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top