సాక్షి, విజయవాడ: ఆపరేషన్ కగార్(Operation Kagar) నేపథ్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సీపీఐ తీవ్రంగా ఖండించింది. కగార్ పేరుతో ఏకపక్షంగా పట్టుకొని చంపుతున్నారని మండిపడుతూనే.. కోర్టులు ఈ ఎన్‌కౌంటర్‌లను సుమోటోగా స్వీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరుతుఉన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కి ఎన్‌కౌంటర్ అంటే ఏంటో తెలీదు. మనుషులను చంపి జబ్బులు చరుస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లంతా అర్బన్ నక్సలైట్లు. రామరాజ్యం అంటే అందర్నీ చంపడమేనా?. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. మనుషుల్ని చంపడమే లక్ష్యంగా.. ఒక ఫ్యాషన్‌గా మార్చుకుంది. ఈ దాడులకు నిదర్శనం కామ్రేడ్ హిడ్మా హత్యే!.
హిడ్మా సరెండర్ అవుతారు అనే వార్తలు వచ్చాయి. వాటిని అమిత్ షా ఖండించి.. ఒప్పుకోలేదు. కాల్పుల విరమణ చేసుకున్నాం అని ప్రకటించిన వారిని చంపడం అన్యాయం. దేశంలో చట్టాలు ఉన్నాయి. నేరాలు చేస్తే అరెస్టులు చేయాలి కానీ చంపడం ఏంటి?. అయినా మనుషులను చంపడం వల్ల సిద్ధాంతాలను.. భావాల్ని అంతం చేయలేరు. దేవ్ జి అలియాస్ తిరుపతి పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న వాళ్లను కోర్టులో హాజరుపరచాలి.
.. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా హత్యలు చేస్తోంది. గడిచిన మూడేళ్లలో 1,200 మందిని చంపారు. మనుషులను చంపుతున్న వారికి మోదీ అమిత్ షాలు.. ఏదో ఇతర దేశాల మీద గెలిచినట్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వారి గురించి శ్వేత పత్రం విడుదల చేయండి. ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణకు ఆదేశించండి.
.. జరిగిన ఎన్‌కౌంటర్లపై కోర్టులు సుమోటోగా కేసులు తీసుకోవాలి. దేశానికి కోర్టుల మౌనం చాలా నష్టం చేస్తుంది. ప్రజలు ఉద్యమం చేస్తే మరో శ్రీలంక బంగ్లాదేశ్ అవుతది. మహా మహా ఘోరమైన నియంతలు హిట్లర్ లాంటివాళ్ళు కాలగర్భంలో కలిశారు.
అడవిలో ఉన్న వాళ్లను మమ్ములను కలవకుండానే అంతం చేస్తున్నారు. మమ్ములను సంప్రదిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సీపీఐ పార్టీ తరఫున న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాం. వామపక్ష పార్టీలను అందరం కలిసి ప్రజాపోరాటం చేయబోతున్నాం. రేపు(గురువారం, నవంబర్ 20) అన్ని వామపక్ష పార్టీలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేస్తాం అని కూనంనేని అన్నారు.


