విడివిడిగా.. కూలంకషంగా | Sakshi
Sakshi News home page

విడివిడిగా.. కూలంకషంగా

Published Tue, Sep 5 2023 3:05 AM

Congress PEC meets to vet list of candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులతో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ సమావేశమయ్యారు. గాందీభవన్‌లో సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఈ భేటీలు కొనసాగాయి. ప్రతి నాయకుడితో వేర్వేరుగా 10 నిమిషాలకు పైగా మాట్లా డిన మురళీధరన్, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అభిప్రాయ సేకరణ చేశారు.

నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, కోచైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

నేను, మీ నాన్న ఫ్రెండ్స్‌: పొన్నాల 
మురళీధరన్‌ను కలిసిన సందర్భంగా ఆయన తండ్రి, కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పొన్నాల గుర్తు చేసుకున్నారు. తాను మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేరళతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకువచ్చామని, ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లో రొయ్యల పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. పార్టీలో పరిస్థితులు, టికెట్ల ఖరారులో పాటించాల్సిన సామాజిక సమతుల్యత గురించి వారు చర్చించినట్టు సమాచారం.

బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై వీహెచ్‌ చర్చించినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న సిద్దిఖీ కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ భేటీల్లో పాల్గొనగా, మరో సభ్యుడు, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కోర్టు కేసుల కారణంగా రాలేకపోయారని, మంగళవారం వస్తారని గాం«దీభవన్‌ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో స్క్రీనింగ్‌ కమిటీ భేటీ కానుంది.  

జగ్గారెడ్డి లేఖ: పీసీసీ మాజీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పంచాలని, పార్టీ అనుబంధ సంఘాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని మురళీధరన్‌ను జగ్గారెడ్డి కోరారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ పీసీసీ మాజీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ లేఖ ఇచ్చారు.  

నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం 
ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం టీïపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

నమ్మకం నిలబెట్టుకుంటాం: రేవంత్‌ ట్వీట్‌ 
సీడబ్ల్యూసీ తొలి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అంగీకరించిన పార్టీ అధిష్టానానికి రేవంత్‌ ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సమావేశాలను విజయవంతం చేస్తామంటూ సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు.

బీసీలు ఎందుకు గెలవడం లేదు?
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో పాటించాల్సిన సామాజిక సమతుల్యతపై ఈ భేటీల్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. 1989 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 50 శాతం సీట్లు ఎప్పుడూ రాలేదని, ఇందుకు కాంగ్రెస్‌ పార్టీని వెనుకబడిన వర్గాలు అక్కున చేర్చుకోకపోవడమే కారణమని కొందరు వివరించారు.

తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ వైపు బీసీలు మొగ్గుచూపుతున్నారని, అత్యధిక సంఖ్యలో ఉండే బీసీల హృదయాల్లో చోటు సాధించని కారణంగానే కాంగ్రెస్‌ పార్టీకి ఓటమి ఎదురవుతోందని చెప్పారు. దీంతో ‘బీసీలకు సీట్లు ఇస్తే ఎందుకు గెలవడం లేదు?’అని మురళీధరన్‌ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా ఓ ముఖ్య నాయకుడు బదులిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీలోనే అలా జరుగుతోందని, మిగిలిన పార్టీల నుంచి బీసీ నేతలు గెలుస్తున్నారని, ఇందుకు కారణం ఏంటనేది సమీక్షించుకోవాల్సింది పార్టీయేనని చెప్పినట్టు సమాచారం.

ఇక రెడ్డి సామాజిక వర్గంలోని గ్రూపు గొడవలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయని ఓ నేత వివరించినట్టు సమాచారం. కర్ణాటకలోని లింగాయత్‌లు, గౌడ సామాజిక వర్గ నేతలు ఐక్యంగా ఉండి అక్కడ అధికారాన్ని దక్కించుకోవడాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలను విన్న మురళీధరన్‌ ‘ఏం జరుగుతుందో వేచి చూద్దాం.’అంటూ బదులివ్వడం గమనార్హం.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement