మునుగోడులో కాంగ్రెస్ 90 రోజుల ప్లాన్.. బీజేపీ, టీఆర్‌ఎస్‌కు దీటుగా

Congress Party Munugode Election Campaign - Sakshi

రేపటి నుంచి కాంగ్రెస్‌ ఉధృత ప్రచారం... 90 రోజుల కార్యాచరణకు నిర్ణయం 

జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన టీపీసీసీ 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాలని, వినాయక చవితి తర్వాతి రోజు నుంచే టీఆర్‌ఎస్, బీజేపీలకు దీటుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి 90 రోజుల కార్యాచరణను ఆ పార్టీ చేపట్టింది. మంగళవారం మధ్యాహ్నం గాంధీ భవన్‌ నుంచి నిర్వహించిన జూమ్‌ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఇన్‌చార్జులుగా నియమితులైన నేతలు, టికెట్‌ ఆశావహులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.  

ఇన్‌చార్జిలు నియోజకవర్గంలోనే ఉండాలి 
మండలాల ఇన్‌చార్జిలుగా నియమితులైన నేతలందరూ సెప్టెంబర్‌ 1 నుంచి ఉప ఎన్నిక ముగిసేంతవరకు నియోజకవర్గంలోనే మకాం వేయాలని రేవంత్, ఉత్తమ్‌ సూచించారు. స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌ను కాపాడుకోవడంతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీలు ఎలా కుమ్మక్కై ఉప ఎన్నికను తీసుకువచ్చా యో, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయ డంలో ఆ రెండు పార్టీలు ఎలా విఫలమయ్యాయో ఓటర్లకు వివరించాలని చెప్పారు. మండలాల ఇన్‌చార్జిలే రోజుకో గ్రామం చొప్పున బాధ్యత తీసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సెపె్టంబర్‌ మొదటి వారంలోనే టీపీసీసీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

ఓటర్లారా .. ఆలోచించండి 
టీపీసీసీ రూపొందించిన 90 రోజుల కార్యాచరణలో భాగంగా.. ఓటు ఎవరికి వేయాలో ఆలోచించాల్సిందిగా ఓటర్లను కరపత్రాల రూపంలో కాంగ్రెస్‌ నేతలు అభ్యర్థించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలు.. కేంద్రం ఇచ్చిన ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షల జమ లాంటి అంశాలను కరపత్రంలో పొందుపరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఓటర్లను నేరుగా కలిసి అభ్యరి్థంచే బాధ్యతను మండల ఇన్‌చార్జిలే తీసుకోవాలని సమావేశంలో సూచించారు. తామే అభ్యర్థి అనే రీతిలో బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
చదవండి: ఇక్కడ రాజకీయాలు కూడా అంతే రిచ్‌గా..!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top