
ఆ నేత ఒకప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరు. ఆవేశం పాళ్ళు కూడా ఎక్కువే. తెలంగాణ వచ్చాక ఆయనకు రాజకీయాలు కలిసిరావడంలేదట. అందుకే ఈ మధ్య సైలెంట్‌గా ఉంటున్నారా? రాజకీయాల్ని వదిలేయాలనుకుంటున్నారా? లేక పార్టీ మారదామనుకుంటున్నారా? ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు..?
దామోదర రాజనరసింహ. ఉమ్మడి ఏపీకి ఆఖరు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన తీరే వేరు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్ సరైన దారిలో నడవడంలేదని ఆయన ఆరోపణ. జనం దగ్గరికి వెళ్ళడంలో ఉద్యమాలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఆయన ఎన్నో మార్లు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలకు ఒక్కోసారి వెళతారు..మరోసారి వెళ్ళరు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి పాలవడం దామోదర రాజనర్సింహను కొంత కుంగ దిసిందని పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. ఒక వైపు బీఆర్ఎస్..ఇంకో వైపు బీజేపీ కలిసి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నా పట్టించుకోవడం లేదని తనను కలిసిన వారితో వాదిస్తున్నారట.
రాహుల్ గాంధీ జోడో యాత్రలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో చురుకుగా పాల్గొన్న దామోదర రాజనర్సింహ ఆ తరువాత పార్టీలో పరిణామాల నేపథ్యంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ వ్యవహార శైలి నచ్చకపోవడంతో ఆయనపై మీడియా ముఖంగానే నిప్పులు చెరిగారు. దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని, కూతురు త్రిష కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చెరుదామని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దామోదర రాజనర్సింహ తమ్ముడు రామచందర్ నెల రోజుల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలోనే దామోదర సతీమణి పద్మిని కూడా ఉదయం బీజేపీలో చేరి సాయంత్రానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దామోదర రాజనర్సింహ బీజేపీ నేతలతో టచ్ ఉన్నారనే భావన రాష్ట్ర నేతలు, స్థానిక కార్యకర్తల్లో ఉందని సమాచారం.
రాహుల్ గాంధీ ఎంపీ సీటుపై అనర్హత విషయంలో దామోదర రాజనర్సింహ స్పందించకపోవడం పట్ల స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారట. సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం నుండి దామోదర రాజనర్సింహ ఎనిమిది సార్లు పోటీ చేయగా మూడు సార్లు గెలుపొందారు. దివగంత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు ఓడిపోయిన దామోదర అందోల్‌లో ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలన్న కసితో ఉన్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా దామోదర రాజనర్సింహ వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ తరపునే పోటీ చేస్తారా? లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు కాషాయ తీర్థం తీసుకుంటారా అనే చర్చ ఆందోల్లో జరుగుతోంది.