Congress Crisis: కాంగ్రెస్‌ను చీల్చొద్దు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు

Congress Crisis: Chidambaram Reacts On G23 Rebel Leaders Demand - Sakshi

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఓటమి ఫలితాలపై కాంగ్రెస్‌లో ముఖ్యంగా గాంధీ కుటుంబ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఇక గాంధీ కుటంబ నాయకత్వం ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సిందేన‌ని జీ23 గ్రూపు నేత‌లు పెద్ద ఎత్తును డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబ‌రం స్పందించారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట‌మికి.. గాంధీ కుటుంబ నాయకత్వం మాత్ర‌మే బాధ్యుల్ని చేయ‌డం సరికాదని అన్నారు. పరాజయం బాధ్య‌త నుంచి ఎవరు పారిపోవ‌డం లేద‌ని.. ఓట‌మికి తాము బాధ్య‌త వ‌హిస్తున్నామ‌ని గాంధీ కుటుంబం ప్ర‌క‌టించింద‌ని గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట‌మికి తానూ బాధ్య‌త వ‌హిస్తున్నాన‌ని చిదంబరం తెలిపారు. అదే విధంగా మిగ‌తా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓట‌మికి కూడా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు బాధ్య‌త వ‌హిస్తున్నార‌ని చెప్పారు.

జీ 23 గ్రూప్‌ నేత‌లు త‌మ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీని చీల్చ‌డానికి ప్రయత్నం చేయవద్దని చిదంబరం విజ్ఞ‌ప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆగస్ట్‌లో జరిగే అవకాశం ఉందని, అప్పటివరకు సోనియా గాంధీనే నాయకత్వం వహిస్తారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై గాంధీ కుటుంటాన్ని నిందించడాన్ని ఆయన తప్పుపట్టారు.

‘ఎవరూ బాధ్యత నుంచి పారిపోరు. బ్లాక్, జిల్లా, రాష్ట్ర  AICC(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) స్థాయిలో నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ బాధ్యత ఉంది. ఎ‍న్నికల ఓటమికి కేవలం ఏఐసీసీ నాయకత్వానిదే బాధ్యత అనడం సరికాదు’ అని చిదంబరం అన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్‌ పార్టీని తిరిగి గాడిలోకి తీసుకురావడానికి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని జీ23 గ్రూపు నేత‌ల్లో ఒకరైన సీనియర్‌ నేత కపిల్ డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top