‘రంగారెడ్డి’ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? | Sakshi
Sakshi News home page

‘రంగారెడ్డి’ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?

Published Sat, May 18 2024 5:32 PM

Confusion In Rangareddy District Congress Leaders

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పార్టీ క్యాడర్‌లో ఇంకా అయోమయం కొనసాగుతోంది. హస్తం శ్రేణుల్లో ఈ ఆందోళనకు కారణమేంటి? పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా ? గ్రూపు తగాదాలు పార్టీ క్యాడర్‌కు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు పెద్ద ఎత్తున చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ?  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ...గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారనే ప్రచారంతో పార్టీ క్యాడర్‌కు కునుకుపట్టనివ్వడం లేదు.  హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ వివిధ కారణాలతో కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. 

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ... పార్టీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామా అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్ లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండోసారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. 

స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు. తాండూరు కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్‌లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత  మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.

అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement