నస్తూరుపల్లి బహిరంగ సభలో వ్యవసాయ మంత్రి తుమ్మలతో కలిసి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మహేశ్‌గౌడ్,
2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం
ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా
2034 వరకు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్‌దే
నస్తూరుపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజాపాలనా పోవాలా?పాపాల భైరవుడి పాలన కావాలా?
జీవన్‌రెడ్డితోపాటు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి
14 సార్లు బీఫామ్ ఇచ్చి ఓడినా, గెలిచినా మద్దతు పలికితే సంయమనం పాటించకపోవడం అప్రజాస్వామికం కాదా?
వైఎస్సార్, డీఎస్‌లా నేను, మహేశ్‌గౌడ్ పనిచేస్తాం
రెండో విడత రైతు భరోసా రూ.5,700 కోట్లు విడుదల
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కేసీఆర్ కాస్కో.. 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం. నీకున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. అసలు ఈ చట్టాలే లేకుంటే, అటవిక రాజ్యమే అయితే మిమ్మల్ని చెట్టుకు ఉరేసినా తప్పులేదు. కాంగ్రెస్ కార్యకర్తల తరఫున సవాల్ చేస్తున్నా..వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల లోతున పాతరేస్తాం..’అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కొందరు స్వార్థపర నాయకులు ప్రజాపాలన పోయి పాపాల భైరవుల పాలన రావాలని కోరుకుంటున్నారని, అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం సీఎం.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులతో కలిసి జేఎస్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మేడిగడ్డ బరాజ్ పరిశీలన తర్వాత కాటారం మండలం నస్తూరిపల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. రెండో విడత రైతుభరోసా రూ.5,700 కోట్లు ఆన్‌లైన్‌లో విడుదల అనంతరం మాట్లాడారు. జై కాంగ్రెస్ అంటూ ప్రసంగాన్ని మొదలెట్టిన ఆయన ‘తోడేలు బయటకు వెళ్లింది. ఈ సభ చూసి వారి గుండెలు అదరాలి..’అంటూ మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జగిత్యాలలో కేసీఆర్ సభను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఎవరి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి
‘రైతు ఆత్మగౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రజాపాలన కావాలో.. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారిన ఆ పెద్దమనిషితో పాటు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ దేశానికి వెన్నెముకైన రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోంది. రైతు సంక్షేమం అనేది కాంగ్రెస్ నినాదం కాదు విధానం. ఆ దిశలోనే ఆనాడు శాశ్వత ప్రాతిపదికన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టి సాగునీరు అందించడం చరిత్ర పుటల్లో లిఖితమయ్యింది.
నాడు వ్యవసాయం దండగ అన్న ప్రభుత్వాలకు చరమగీతం
ఆత్మహత్యల వైపు పయనిస్తుంటే వారి ఆత్మగౌరవం నిలబెట్టాలని గిట్టుబాటు ధర కల్పన చట్టం తీసుకరావడమేగాక పంటల అధిక ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు దోహదపడ్డాయి. వ్యవసాయం దండగ అని కరెంటు ఇవ్వని ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ వైఎస్సార్ పాదయాత్ర చేసి దేశంలోనే మొదటిసారి చేవెళ్ల వేదికగా ఉచిత కరెంటు అమలు చేసి రైతుకు బాసటగా నిలిచారు. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని నాటి పీఎం మన్మోహన్‌సింగ్ 72 వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తుల్ని చేసిన ఘనత చరిత్రలో నిలిచింది.
దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నాం..
తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు కోసం రాష్ట్రంలో ఇరువైపులా నేను, సమ్మక్క సారలమ్మ సాక్షిగా బాసర టు భద్రాది వరకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షల రుణమాఫీని దశల వారీగా నేరవేరుస్తున్నా ప్రతిపక్షాలు ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయి. నాడు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 25.35 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించాం. నేడు రైతు భరోసా కింద రూ.5,300 కోట్లు ఖాతాల్లో వేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించుకునే దిశలో సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మిస్తున్నాం. 3.15 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ప్రజాపాలన పోవాలో.. పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారుతున్న పెద్దమనిషి ఆత్మవిమర్శ చేసుకోవాలి..’అని సీఎం అన్నారు.
జీవన్‌రెడ్డి అర్హత ఏంటో తేలింది..
ఫామ్‌హౌస్‌లో పడుకున్న పెద్దాయనకు పాలన మళ్లీ ఎందుకని ప్రశ్నించకుండా, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం రక్తమోడ్చి జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకుల శ్రేయస్సు విస్మరించి ప్రజాపాలన వచ్చే ముందు జగిత్యాలో ఓడిన జీవన్‌రెడ్డి అర్హత ఏంటో తేలింది. ఇక ఆ పెద్దమనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పక తప్పదు. 1983లో తుమ్మల నాగేశ్వర్‌రావు సాక్షిగా ఎన్‌టీఆర్ ఎమ్మెల్యేగా టికెట్టు ఇచ్చి గెలిపించడమే గాక ఎక్సైజ్ మంత్రి పదవి ఇస్తే ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో జట్టు కట్టినా దిక్కులేక కాంగ్రెస్‌లో చేరడం నిజం కాదా? కాంగ్రెస్‌లో 14 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే, ఓడినా గెలిచినా మద్దతు పలికితే సంయమనం పాటించకపోవడం అప్రజాస్వామికం కాదా? జగిత్యాల ప్రజలు నీకు ఊడిగం చేసింది వాస్తవం కాదా? ఈ వయస్సులో రాజకీయ నీతి విస్మరించి శత్రువు చేతిలోచేరి ప్రజాపాలన పోవాలి...పాపాల భైరవుడు కేసీఆర్ పాలన రావాలనడం సిగ్గు చేటు..’అంటూ సీఎం ధ్వజమెత్తారు.
కుట్ర రాజకీయాలకు తావు లేదు..
‘గతంలో వైఎస్సార్, డీఎస్ కాంబినేషన్ మాదిరి నేను, మహేశ్‌కుమార్‌గౌడ్ కలిసి పార్టీని అధికారంలోకి తెస్తాం. దళిత బిడ్డలు, బీసీలు, ఆదివాసీలను మంత్రులు చేసిన ప్రజాపాలన పోవాలనే కుట్ర రాజకీయాలకు తెలంగాణలో తావులేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రాజ్యమే తప్ప మరొకటి రాదు. చరిత్ర పునరావృతం చేసేలా హైదరాబాద్‌ను మహానగరం చేస్తూ, పాలమూరు వంటి ప్రాజెక్టులకు పూర్తి చేస్తూ ఎవరు అడ్డొచ్చినా తొక్కుతూ ముందుకు పోతాం..’అని రేవంత్ అన్నారు. దేశంలో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గాక రాహూల్‌ను ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్‌రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


