ఎరువుల ధరలు పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచారు: సీఎం కేసీఆర్‌

CM KCR Fires On Narendra Modi Over Fertilizer Cost Hike  - Sakshi

హైదరాబాద్‌: ఎరువుల ధరల పెంపు అంశంలో కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపును నిరసిస్తూ ప్రధాని మోదీకి కేసీఆర్‌ బహిరంగలేఖ రాశారు. ఎరువుల ధరలు పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచారని లేఖలో కేసీఆర్‌ విమర్శించారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని ఎద్దేవా చేశారు. కేంద్రం.. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరోసారి నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదన్నారు. కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం... ఎన్ఆర్జీఈ నీ వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం ...వెనక కుట్ర దాగి వుందన్నారు.

రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేం‍ద్రం కుట్రలు చేస్తుందని విమర్శించారు.  బీజేపీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం తిరగబడాలన్నారు.  నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప  వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రానికి బుద్ధి వచ్చేదాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే ఎరువుల ధరలను తగ్గించాలని.. లేని పక్షంలో దేశ వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకొని  బీజేపీ ప్రభుత్వం పై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో  కలిసిరావాలనీ పిలుపు నిచ్చారు.

చదవండి: సజ్జనార్‌కు అర్ధరాత్రి యువతి ట్వీట్.. వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top