రాజాం టీడీపీలో వర్గపోరు

Clashes Between Rajam TDP Leaders - Sakshi

బ్యానర్ల సాక్షిగా బయటపడ్డ విభేదాలు  

పార్టీ ఇన్‌చార్జి కోండ్రు ఫొటో లేకుండా ప్రతిభా భారతి బ్యానర్‌ 

రేగిడిలో కొలిక్కిరాని ‘దేశం’ డ్రామా  

వంగరలోనూ వ్యతిరేకత  

సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర వ్యాప్తంగా కనుమరుగైపోయిన టీడీపీకి రాజాంలో జీవం పోయడానికి ప్రయత్నిస్తున్న ఆ పార్టీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ను అసమ్మతి సెగ వెంటాడుతోంది. ఇప్పటికీ పార్టీ అధిష్టానం చేస్తున్న కార్యక్రమాలు నచ్చక ప్రజలు కనీసం కన్నెత్తి చూడకపోగా, పార్టీలో వర్గ విభేదాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. 

బ్యానర్ల కలకలం.. 
నాలుగు నెలలు క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ప్రజాదరణను జీర్ణించుకోలేక ఉనికి కోసం టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి స్పందన కరువయ్యింది. చివరకు పార్టీలోని నియోజకవర్గ పెద్దలు కూడా సహకరించడంలేదని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి, ఆమె కుమార్తె గ్రీష్మాప్రసాద్‌లు రాజాం పట్టణంలో పలుచోట్ల భారీ బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో కోండ్రు మురళీమోహన్‌ ఫొటో ఎక్కడా కనిపించకపోవడంతో పలువురు టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

మురళీమోహన్‌ రాజాంపై పెత్తనంకోసం తనకు అన్యాయం చేయడం కారణంగానే ప్రతిభాభారతి కోండ్రును పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాజాం టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిస్తే తాను గెలిచే అవకాశాలు ఉండగా.. కోండ్రు రాకతో టికెట్‌ లభించలేదనే అభిప్రాయంలో ఆమె ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో రాజాం నియోజకవర్గ టీడీపీ టిక్కెట్‌ తన కుమార్తె గ్రీష్మాప్రసాద్‌కు తెప్పించుకునే పనిలో ఆమె ఉన్నట్లు టీడీపీ తమ్ముళ్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.  

చదవండి: (బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది: తోపుదుర్తి)

అన్ని మండలాల్లోనూ అదే పరిస్థితి..   
టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సొంత మండలం రేగిడిలో టీడీపీని నడిపించే నాయకులు ఎవరూలేకపోవడం గమనార్హం. గతంలో క్రియాశీలకంగా ఉన్న కిమిడి రామకృష్ణంనాయుడు, ఆయన కుమారుడు వినయ్‌కుమార్‌లు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు.  
వంగర మండలంలో కోండ్రుపై  వ్యతిరేక పవనాలు నడుస్తున్నాయి. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్యాడర్‌ చాలా వరకూ వైఎస్సార్‌సీపీ గూటికి వెళ్లిపోయింది. కనీసం పోటీకి అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది.  
సంతకవిటి మండలంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కొల్ల అప్పలనాయుడును ఇంతవరకూ గుర్తించలేదు. గతంలో ఎమ్మెల్సీ రాకుండా పెద్దలు అడ్డుకోవడంతో ఈయన చాలా తక్కువగానే పార్టీ కార్యక్రమాలకు హాజరౌతున్నారు.  
రాజాం పట్టణం, మండలంలో  ప్రతిభాభారతికి అనుకూలంగా కార్యకర్తలు ఉన్నారు. దీంతో కోండ్రు కార్యక్రమాలు గాలిబుడగను తలపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top