
సాక్షి, అమరావతి/చిత్తూరు అర్బన్: వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలో 20 ఏళ్లుగా టీకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు దుకాణాన్ని తొలగించారని.. శ్రీకాకుళం జిల్లా పలాసలో తమ అభ్యర్థులను బెదిరించి వైఎస్సార్‌సీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. జగన్‌స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్ఛవమైందని పేర్కొన్నారు.
నేడు చిత్తూరులో చంద్రబాబు ధర్నా
టీడీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చిత్తూరు జిల్లా నేతలు ఫిర్యాదు చేయడంతో అక్కడ నిరసన తెలియచేయడానికి చంద్రబాబు సోమవారం చిత్తూరు నగరానికి రానున్నారని పార్టీ నేతలకు సమాచారం అందింది. ఇదిలా ఉండగా ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్టు పోలీసులు చెప్పారు.