
సాక్షి, హైదరాబాద్: వందరోజుల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి సాధించిందేముందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. నన్ను చూసి, వందరోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన పాలనలో ఏముందని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సీఎంగా రేవంత్‌రెడ్డి అటు ప్రజలను, ఇటు కాంగ్రెస్ పార్టీని సైతం మోసం చేశారని ధ్వజమెత్తారు. బుధవారం హరీశ్‌రావు మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ సీఎం కాషాయ లవ్ లెటర్ రాశారని విమర్శించారు.
మళ్లీ మోదీనే కేంద్రంలో అధికారంలోకి వస్తాడు అన్నట్టుగా రేవంత్ మాట్లాడారని హరీశ్‌రావు పేర్కొన్నారు. 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రానుండగా, మోదీని ఎందుకు అంత పొగడడమని నిలదీశారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని రాహుల్ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ... రేవంత్ మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారని.. ఇందులో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అవుతాడన్నప్పుడు.. మోదీ సహకారం ఎందుకు కావాలని అడుగుతారు? ’అని నిలదీశారు.
కాంగ్రెస్‌తో పాటే వచ్చిన కరువు
‘కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కరువొచ్చింది. కొత్త కొత్త బోరు బండ్లు వచ్చాయి. ట్యాంకర్ల ద్వారా వరిపంటకు నీళ్లుపోస్తున్నారు. అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్లు ఇస్తామన్నారు.. కనీసం రూ.2వేల పింఛన్‌ను కూడా నెలనెలా ఇవ్వడం లేదు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఇంత వరకు ఆ ఊసే ఎత్తలేదు. కనీసం వచ్చే యాసంగికైనా రూ.500 బోనస్ ఇవ్వాలి. ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి.. ఇప్పుడు రక్తం పిండి వసూలు చేస్తున్నారు.
నిరుద్యోగులకు రూ.4వేలు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో ఆ ఊసే ఎత్తలేదు. ఆటో అన్నలకు రూ.12వేలు ఇస్తామని చెప్పారు. ఎందరో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుడు అప్పుల గురించి మాట్లాడి... ఇప్పటికే రూ.16వేలకోట్లు అప్పులు చేశారు. ఇంకా అప్పు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి హామీ పథకం పని చేసే 3000 మందికి ఇప్పటివరకు జీతాలు రాలేదు. విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు లేవు. విదేశీ విద్యకు ఇప్పటివరకు పైసలు ఇవ్వడం లేదు.’అని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం రిపోర్టుకు నాలుగు నెలలా?
’’కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్డీఎస్‌ఎ రిపోర్ట్ రావడానికి 4 నెలల సమయం ఎందుకు పడుతుంది? వచ్చే వానాకాలంలో నీళ్లు ఇవ్వరా? వర్షాకాలంలో ఫ్లడ్ వచ్చి పంప్ హౌస్ మునిగిపోతే, మేము ప్రభుత్వానికి భారం పడకుండా త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు లిఫ్ట్ చేశాము. తుమ్మిడి హెట్టి దగ్గర ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భూసేరణ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేయవచ్చు. తుమ్మిడి హెట్టిపై రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడారు’’అని హరీశ్ విమర్శించారు.