రాష్ట్రాన్ని ముంచుతున్న ‘ముంపు మేస్త్రీ’ సీఎం రేవంత్
నదీజలాలపై అవగాహన లేని సీఎంతో తెలంగాణకు మరణ శాసనం
ముగ్గురు సీఎంలు చేసుకున్న చీకటి ఒప్పందం బయట పెట్టాల్సిందే
బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి హక్కు లను తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడికి గురుదక్షిణగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాకట్టు పెడుతున్నారని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకుండా తెలంగాణ ప్రయోజనాలను బలి పెడుతూ ‘ముంపు మేస్త్రీ’లా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి, రాష్ట్ర భవిష్యత్‌ను కేంద్రం చేతుల్లో పెట్టే చీకటి ఒప్పందం జరిగిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం 35 టీఎంసీల నవేలి రిజర్వాయర్‌తోపాటు 9.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు బరాజ్‌లు, ఏపీ ప్రభుత్వం 20 టీఎంసీల గుండ్రేవుల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా సీఎం రేవంత్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల మొత్తం 55 టీఎంసీల నీరు నిల్వ అవుతుందని, శ్రీశైలానికి ప్రవాహం తగ్గి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతోపాటు ఆర్డీఎస్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
రహస్య ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ముఖ్యమంత్రుల సమావేశంలో మంత్రి ఉత్తమ్, రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులను బయటే ఉంచి కేవలం ముగ్గురు సీఎంలు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి మాత్రమే పాల్గొనడం అనుమానాలకు తావిస్తోందని హరీశ్‌రావు అన్నారు. ఆ సమావేశంలో జరిగిన చర్చలు, కుదిరిన ఒప్పందాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్‌కు ట్రిబ్యునల్ ప్రకారం రావాల్సిన 15.9 టీఎంసీల వాటా, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటి భద్రత, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్‌పై సమావేశంలో ఎలాంటి హామీ సాధించారో సీఎం వెల్లడించాలన్నారు. నదీ జలాలపై సరైన అవగాహన లేకపోవడంతోనే ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమవుతోందని విమర్శించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చర్యల వల్ల చివరకు నష్టపోయేది తెలంగాణేనని, అయినా ప్రభుత్వం నిరసన వ్యక్తం చేయకపోవడం విచారకరమని చెప్పారు.
సమ్మక్క సాగర్‌ను బలి చేయొద్దు
గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నికర జలహక్కులను పూర్తిగా సాధించకుండా నదుల అనుసంధానం పేరుతో ఏపీకి అనుకూలంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో 830 టీఎంసీలకు అనుమతులు సాధించగా, మిగిలిన 138 టీఎంసీల కోసం సమ్మక్క సాగర్, వాద్ర, ఎల్లంపల్లి ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమ్మక్క సాగర్ ప్రతిపాదనలు వెనక్కి వచ్చాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల పేరుతో సమ్మక్క సాగర్‌ను బలిపెడుతున్నారన్న వార్తలపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు ముందు తెలంగాణ హక్కులను బలంగా వినిపించాల్సిన సమయంలో ప్రభుత్వం మౌనం పాటిస్తోందన్నారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని, మూడు రాష్ట్రాల సమావేశంలో చర్చించిన అంశాలను శాసనసభలో పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్కనీరు తగ్గినా బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.


