పాతబస్తీలో కాషాయజెండా

BJP President Bandi Sanjay Launches Praja Sangrama Yatra - Sakshi

మజ్లిస్‌ను తరిమికొడతామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రం ఇచ్చే పథకాలను తమ పథకాలుగా పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. బీజేపీ భారతీయుల పార్టీ, అన్ని వర్గాల వారిని గౌరవిస్తుంది. ముస్లిం మహిళల మేలు కోరే త్రిపుల్‌ తలాఖ్‌ను మోదీ రద్దు చేశారు. దేశం కోసమే 370 ఆర్టికల్‌ను రద్దు చేశారు.  

అధికారంలో ఉండే పార్టీకి తొత్తులా మారి అసదుద్దీన్‌ పబ్బం గడుపుకుంటున్నారు. హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించి లబ్ధిపొందడం మజ్లిస్‌ పార్టీకే చెల్లింది. పాతబస్తీలో మజ్లిస్‌ ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొన్నందువల్లే ఆలె నరేంద్రను టైగర్‌గా, బద్దం బాల్‌రెడ్డిని గోల్కొండ సింహంగా ప్రజలు పిలుచుకున్నారు. మజ్లిస్‌ గూండాగిరి కారణంగానే నందరాజ్‌ గౌడ్, పాపన్నలు బలయ్యారు.  
– గోల్కొండlసభలో బండి సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌/గోల్కొండ: పాతబస్తీ నుంచి మజ్లిస్‌ను తరిమికొట్టి కాషాయ జెండాను ఎగరేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పునరుద్ఘాటించారు. నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలన విముక్తే లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’రెండో రోజైన ఆదివారం మెహిదీపట్నం, షేక్‌పేట్, గోల్కొండ కోట మీదుగా సాగింది. ఈ సందర్భంగా షేక్‌పేట్‌ నాలా వద్ద సభలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులను పెంచిపోషిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పాతబస్తీలో ఉండే ప్రతి హిందువు ధైర్యంగా ఉండాలని సూచించారు. వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మెట్రో, ఎంఎంటీఎస్‌ సేవలను పాతబస్తీకి విస్తరింపజేయాలని డిమాండ్‌ చేశారు. తద్వారా ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. 2023 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తామని, మొదటి సభను భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తన యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో టీఆర్‌ఎస్, మజ్లిస్‌ పార్టీ అధినేతలకు నిద్రపట్టడం లేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతోందని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమని అన్నారు. యాత్ర ఇన్‌చార్జ్‌ కోలార్‌ ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి రూ.65 వేల కోట్ల అప్పులు ఉండేవని, ప్రస్తుతం రూ. 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని విమర్శించారు.  

పూల వర్షం కురిపిస్తూ... 
మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో శనివారం రాత్రి బస చేసిన సంజయ్‌ ఆదివారం ఉదయం యాత్రను ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ.. బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల నుంచే కాకుండా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యాదవ సంఘాలకు చెందిన కొందరు యువకులు దున్నపోతులను తెచ్చి వాటిపై సవారీ చేస్తూ యాత్రలో అందరి దృష్టిని ఆకర్షించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top