సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే!

The BJP High Command Has Focused On Coming To Power In Telangana - Sakshi

రాష్ట్రంలో బీజేపీ వేసే ప్రతీ అడుగు, కార్యక్రమం జాతీయ నాయకత్వం అదుపాజ్ఞల్లోనే.. 

విభిన్న అంశాలపై నేరుగా ఢిల్లీకే రిపోర్ట్‌ చేసేలా పనిచేస్తున్న బృందాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ వేసే ప్రతీ అడుగు, నిర్వహించే కార్యక్రమాలన్నీ బీజేపీ అగ్రనాయకత్వం కనుసన్నల్లోనే సాగుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అధినాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే పకడ్బందీ ప్రణాళికను అమలుచేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యక్ష పర్యవేక్షణల్లోనే కార్యాచరణ రూపొందుతోంది. తెలంగాణలో ఏడాదిగా విభిన్న అంశాలపై నేరుగా అమిత్‌ షా, నడ్డాలకు రిపోర్ట్‌ చేసేలా వివిధ సంస్థలు, బృందాలు పనిచేస్తున్నాయి. గతేడాది ఆగస్టులో బండి సంజయ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు నుంచే కొన్ని బృందాలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై పరిశీలనను మొదలుపెట్టాయి. 

బూత్‌ కమిటీలపై అమిత్‌షా సమీక్ష 
రాష్ట్రంలో మూడు, నాలుగు నెలలుగా క్షేత్రస్థాయి నుంచి సమాచార సేకరణ ఫుల్‌ స్పీడ్‌లో సాగుతోంది. దీనికోసం పదుల సంఖ్యలో అధ్యయన, సమాచార సేకరణ బృందాలు నిమగ్నమయ్యాయి. సర్వేలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, పోటీచేసే సత్తా ఉన్న అభ్యర్థులు, పార్టీల బలాబలాలు తదితరాలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఈ బృందాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేస్తున్నాయి. సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయడంతోపాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 25లోగా పోలింగ్‌ బూత్‌ కమిటీల ఏర్పాటు, ఆ కమిటీ కన్వీనర్లు, సభ్యుల నియామకం పూర్తిచేయాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించింది.

ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న అమిత్‌ షా.. 17న జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జీలు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కిందిస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, బూత్‌ కమిటీల నియామకం, టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై వ్యతిరేకత వంటి విషయాలపై ఆరా తీయనున్నట్టు సమాచారం. కేసీఆర్‌ పాలన తీరు, టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలపై అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలపై కిందిస్థాయి కార్యకర్తలు, నాయకుల నుంచి సమాచార సేకరణకు అమిత్‌ షా ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలు, వాటి బలాబలాలు తదితర అంశాలపై ఇప్పటికే నాయకత్వానికి అధ్యయన బృందాలు నివేదికలు అందజేసినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన పది ఉమ్మడి జిల్లాల సమీక్షల్లో బలమైన అభ్యర్థులు లేని అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను సిద్ధం చేశారు.

ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top