వాడిన కమలం: ‘సిట్టింగ్‌’ కోల్పోయి.. ‘సెకండ్‌’ పోగొట్టుకుని! | BJP Defeat In Telangana Graduate MLC Elections | Sakshi
Sakshi News home page

వాడిన కమలం: ‘సిట్టింగ్‌’ కోల్పోయి.. ‘సెకండ్‌’ పోగొట్టుకుని!

Mar 21 2021 11:59 AM | Updated on Mar 21 2021 6:45 PM

BJP Defeat In Telangana Graduate MLC Elections - Sakshi

కచ్చితంగా గెలుస్తామనుకున్న మహబూబ్‌నగర్‌– హైదరాబాద్‌– రంగారెడ్డిలో బీజేపీకి ఓటమి ఎదురుకావడంతో బీజేపీ శ్రేణులు నైరాశ్యంలో పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్‌రావు సామాజిక వర్గానికే చెందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవిని టీఆర్‌ఎస్‌ అనూహ్యంగా బరిలో నిలపడంతో ఆ వర్గం ఓట్లు చీలిపోయాయన్న ఆలోచనల్లో పడింది.

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఆత్మ రక్షణలోకి నెట్టాయి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కోల్పోవడంతో పాటు గతంలో రెండో స్థానంలో నిలిచిన స్థానంలో ఈసారి నాలుగో స్థానానికి దిగజారడం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న కమలనాథులు ఈ ఫలితాలతో కంగుతిన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ అనుసరించిన వ్యూహం ముందు నిలవలేకపోయామా? లేదా పట్టభద్రుల ప్రయోజనాలను పసిగట్టడంలో విఫలమయ్యామా? అనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. అయితే పార్టీ విశ్లేషణలు ఎలా ఉన్నా ఈ ఎన్నికల ద్వారా బీజేపీ రాజకీయంగా నష్టపోయినట్లేనని చర్చ జరుగుతోంది.

గెలుస్తామనుకున్న సిట్టింగ్‌ చేజారి.. 
కచ్చితంగా గెలుస్తామనుకున్న మహబూబ్‌నగర్‌– హైదరాబాద్‌– రంగారెడ్డిలో బీజేపీకి ఓటమి ఎదురుకావడంతో బీజేపీ శ్రేణులు నైరాశ్యంలో పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్‌రావు సామాజిక వర్గానికే చెందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవిని టీఆర్‌ఎస్‌ అనూహ్యంగా బరిలో నిలపడంతో ఆ వర్గం ఓట్లు చీలిపోయాయన్న ఆలోచనల్లో పడింది. మరోవైపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, పీఆర్‌సీ ఇవ్వబోతున్నారన్న ఉద్యోగ సంఘాల ప్రకటనలు తమ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణంగా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తి కూడా బీజేపీ ఓటమికి కారణం అయిందనే వాదనలు ఉన్నాయి.

సిట్టింగ్‌ అభ్యర్థి రామ్‌చందర్‌రావు రెండు సార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడం, ఎంపీగా ఆయననే పోటీలో నిలపడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకే టికెటివ్వడం వంటివి పార్టీలోని కొన్ని వర్గాలను అసంతృప్తికి గురి చేసిందనే వాదనలు ఉన్నాయి. గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి వరంగల్‌ వరకే పరిమితమైన నేత అనే భావన పట్టభద్రుల్లో ఉంది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పార్టీ సంస్థాగతంగా బలంగా లేదని, అక్కడి పట్టభద్రుల ఓట్లను రాబట్టుకోవడంలో విఫలమైందనే వాదనలు ఉన్నాయి. దీంతో 2015లో 2వ స్థానంలో ఉన్న బీజేపీ ఈసారి 4వ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్‌పై పెట్టినంత దృష్టి వరంగల్‌పై పెట్టలేదని, అందుకే నాలుగో స్థానాకి పరిమితమైందన్న చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పట్టభద్రులను పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి.

ఆ గెలుపును ఉపయోగించుకోలేకపోయామా? 
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొందిన గెలుపును సరిగ్గా వినియోగించుకోలేకపోయామన్న అభిప్రాయం కొందరు నేతల నుంచి వ్యక్తం అవుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఎలాగూ ఓట్లు వేస్తారనే ఆలోచనలు కూడా తమ ఓట మికి కారణం అయిందన్న భావన నెలకొంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోయారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కొత్తగా చేరిన నేతలు అందరినీ ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన ప్రచారంలో కలుపుకొని పోలేదన్న విమర్శలు ఉన్నాయి. అభ్యర్థుల గెలుపు విషయంలో పార్టీ శ్రేణులంతా తీవ్రస్థాయిలో కృషి చేయలేదన్న వాదన ఉంది. ఉద్యోగాల కల్పనపై టీఆర్‌ఎస్‌ ప్రకటనలను తిప్పికొట్టడంలో వెనుకంజలో ఉన్నారని, కాంగ్రెస్‌ తరహాలో కూడా విమర్శలు చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. కొన్ని అంశాలలో భావోద్వేగ ప్రకటనలు కొన్ని వర్గాల ఓటర్లను దూరం చేశాయని, అదే నల్లగొండ స్థానంలో రెండో ప్రాధాన్యం దక్కకుండా చేసిందని, ఫలితంగా పరాభవం మూటగట్టుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.
చదవండి:
MLC Election Results: ఓడి.. గెలిచిన తీన్మార్‌ మల్లన్న
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫెయిలైన ప్రొఫెసర్లు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement