
కొడిమ్యాలలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న బండి సంజయ్
ఆరు గ్యారంటీల అమలుపై ఎంపీ బండి సంజయ్
జగిత్యాల జిల్లా మల్యాలలో ప్రజాహిత యాత్ర
మల్యాల (చొప్పదండి)/కొండగట్టు: కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు మిగిలింది ఇంకా ఐదు రోజులేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చిపారేసినా ఆ పార్టీ గుణపాఠం నేర్చుకోలేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ అని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఆదివారం ప్రజాహిత యాత్ర చేపట్టిన ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సంజయ్ మల్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు మాట నిలబెట్టుకుంటుందో? లేదో మరో ఐదురోజుల్లో తేలిపోతుందన్నారు. గ్యారంటీల అ మలుకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని, పార్లమెంట్ సమావేశాలకు తాను హాజరుకాలేదన్న విమర్శలు సరికాదని, లోక్‌సభ రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందని స్పష్టం చేశారు. మల్యాల మండలానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకోసం రూ.167 కోట్ల 42 లక్షలు, రోడ్ల నిర్మాణానికి రూ.72 కోట్ల 91 లక్షలు, మొక్కల పెంపకానికి రూ.88 కోట్ల 52 లక్షలు మంజూరు చేసిందని వెల్లడించారు.
పైసలిచ్చిన ఘనత బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లది
బాంబులు పేల్చే పీఎఫ్‌ఐకి పైసలిచ్చిన ఘనత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలదని బండి సంజయ్ అన్నా రు. ప్రజాహిత యాత్రలో భాగంగా ఆయన కొడిమ్యాల మండలం నాచుపెల్లి, కొడిమ్యాల గ్రామా ల్లో మాట్లాడారు. రాముని పేరు వింటేనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు వణుకు పుడుతోందన్నారు. బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి బొడిగ శోభ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.