
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్‌ఎస్ వారసత్వాన్ని స్వీకరించి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదనే అనుమానం కలుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆందోళన కలిగిస్తే, కాంగ్రెస్ సర్కారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ను కూడా నాడు ట్యాప్ చేశారని, ఆయనెట్లా కేసీఆర్‌ను కాపాడుతారని ప్రశ్నించారు.
కేసీఆర్ లాంటి చండాలమైన వ్యక్తిని తానెక్కడా చూడలేదన్నారు. భార్యాభర్తలు బెడ్రూంలో మాట్లాడుకునే మాటలను కూడా ట్యాప్ చేసి విన్న ఘనుడు కేసీఆర్ అని సంజయ్ దుయ్యబట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్‌గా ఉందని, వందశాతం వర్తింపజేస్తే, కేంద్రాన్ని ఒప్పించి బిల్లును ఆమోదింపజేసే బాధ్యత తీసుకుంటామన్నారు.
51 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇప్పటికే మోదీ ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను అందిస్తోందని, మరి కాంగ్రెస్ ఒరగబెట్టిందేంటని నిలదీశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోమని, అన్ని అంశాలపై కేంద్రం కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిందని సంజయ్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార కర్తలుగా బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లు మాజీ సర్పంచులే ముందుండి పనిచేస్తారన్నారు.