Assembly election 2022: 51 మంది అభ్యర్థుల ఆస్తులు రెట్టింపు

Assembly Candidates Properties Double In Uttarakhand - Sakshi

 ఉత్తరాఖండ్‌లో 51 మంది అభ్యర్థుల ఆస్తులు గత ఎన్నికల కంటే రెట్టింపు

 సగటున 49 శాతం పెరిగినట్లు వెల్లడించిన ఏడీఆర్‌ సంస్థ

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. గత ఎన్నికల సందర్భంగా అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల లెక్కలతో పోలిస్తే , ప్రస్తుత ఎన్నికల్లో పొందుపరిచిన ఆస్తుల లెక్కలు రెట్టింపయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫారమ్స్‌ (ఏడీఆర్‌) శనివారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 51 మంది అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. ఇందులో 40 మంది బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా, మరో 10 కాంగ్రెస్‌ తరఫున, ఒకరు ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. ఈ 51 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ 2017 ఎన్నికల్లో సగటున రూ.4.72 కోట్లుగా ఉండగా, అది 2022 నాటికి రూ.7.05 కోట్లకు పెరిగిందని ఏడీఆర్‌ వెల్లడించింది.

సగటున ఆస్తుల విలువ రూ.2.33 కోట్లు అంటే... 49 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. ఇందులో బీజేపీకి చెందిన 40 మంది అభ్యర్థుల ఆస్తులు గత ఎన్నికల్లో రూ.4.85 కోట్లుగా ఉంటే అవి ప్రస్తుతం సగటున రూ.7.23 కోట్లకు చేరాయని వెల్లడించింది. బీజేపీ తరఫున సోమేశ్వర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేఖా ఆర్య ఆస్తులు గత ఎన్నికల్లో రూ.12.78 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 25.20 కోట్లుగా ఉందని తెలిపింది. ఇదే పార్టీ తరఫున రూర్కీ నుంచి బరిలో ఉన్న ప్రదీప్‌ బత్రా ఆస్తులు రూ.3.81కోట్ల నుంచి రూ.12.06 కోట్లకు చేరాయని తెలిపింది. ఇక కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న 10మంది అభ్యర్థుల ఆస్తులు గత ఎన్నికల్లో సగటున రూ.4.61 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అవి రూ.6.83 కోట్లకు చేరాయని వెల్లడించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top