కేజ్రీవాల్‌.. జాతీయస్థాయి ప్రచారం | Arvind Kejriwal Launches Mission To Make India No. 1 | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌.. జాతీయస్థాయి ప్రచారం

Aug 18 2022 5:17 AM | Updated on Aug 18 2022 5:17 AM

Arvind Kejriwal Launches Mission To Make India No. 1 - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్‌లో అధికార పీఠంపై పాగా వేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈసారి కేంద్రంలో సత్తా చాటాలని ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా జనబాహుళ్యంలోకి దూసుకెళ్లనుంది. సుపరిపాలనకు పంచ సూత్రావళిని ప్రకటిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘మేక్‌ ఇండియా నంబర్‌ వన్‌’ పేరిట జాతీయస్థాయి ప్రచార కార్యక్రమానికి త్రివర్ణ పతాకం ఊపి మరీ శ్రీకారంచుట్టారు.

బుధవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియం ఇందుకు వేదికైంది. ‘‘భారత్‌ ‘అభివృద్ధిచెందిన దేశం’గా అవతరించకుండా చేసి దశాబ్దాలుగా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గా మిగిల్చిన పార్టీలపై ప్రజాస్వామ్యపోరాటంలో గెలుస్తాం. అధికార పగ్గాలు ఇకపై వారికి అప్పజెప్పేదిలేదు’ అంటూ కేజ్రీవాల్‌ ప్రతిజ్ఞచేశారు. ‘ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రభాగాన నిలుపుదాం. అందుకు మాతోపాటు మీరంతా కలిసిరండి’ అంటూ పౌరులనుద్దేశిస్తూ ప్రసంగించారు.

దేశ పురోభివృద్ధికి పాటుపడాలంటే బీజేపీ, కాంగ్రెస్‌.. మరే పార్టీ వారితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూనే బీజేపీ, కాంగ్రెస్‌లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘75ఏళ్ల చరిత్రలో ఈ పార్టీలు కేవలం తమ , తమ స్నేహితుల ఇళ్లను వేలకోట్ల స్థిర, చరాస్థులతో నింపేశాయి. దేశం ఇంకా వీళ్ల చేతుల్లోనే ఉంటే దేశాభివృద్ధి మరో 75 ఏళ్లు వెనకే ఉండిపోతుంది’ అని ఆరోపించారు. ‘ఈ కార్యక్రమం రాజకీయమైందికాదు. భారతజాతి కోసం చేస్తున్న ఉద్యమం’ అని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఐదు సూత్రాలను తప్పక ఆచరణలో పెట్టాలన్నారు.

పంచ సూత్రావళి
► ప్రతి చిన్నారికి ఉచిత, నాణ్యమైన విద్య అందించాలి
► పౌరులందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం, ఔషధాలు అందివ్వాలి. ఉచితంగా పరీక్షలు చేసే రోగ నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు.
► యువతకు ఉద్యోగ కల్పన
► మహిళలకు సమాన హక్కులు, సరైన భద్రత
► రైతుల పంటకు సరైన ధర దక్కేలా చూడాలి. వారి పిల్లలు సైతం తమది రైతు కుటుంబమని గర్వపడేలా చేయాలి. లాభాల పంట పండేలా, రైతుగా కొనసాగాలనే ఆకాంక్ష వారిలో పెంచాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement