దుబ్బాక దెబ్బ: కేసీఆర్‌ వ్యూహం మార్చుతారా? | Sakshi
Sakshi News home page

దుబ్బాక దెబ్బ: కేసీఆర్‌ వ్యూహం మార్చుతారా?

Published Tue, Nov 17 2020 2:44 PM

All Parties Ready For GHMC Elections - Sakshi

రాజధాని నడిబొడ్డున రాజకీయ వేడి మొదలైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో రాజకీయ రణరంగంలోకి దిగేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. విజయమే లక్ష్యంగా ఎత్తులు పైఎత్తులు వేసేందుకు రంగంలోకి దిగాయి. నువ్వా నేనా అనే రీతిలో తలపడేందుకు రాష్ట్ర రాజధాని వేదికైంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న కీలకమైన ఎన్నికల కావడంతో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన కాషాయదళం కారుజోరుకు సవాలు విసురుతోంది. మరోవైపు వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునే పరిస్థితి నెలకొంది. ఇక టీఆర్‌ఎస్‌-ఎంఐఎం జోడీ మరోసారి గ్రేటర్‌ పీఠంపై కన్నేసింది.

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో మంగళవారం ప్రధాన పార్టీల నేతలంతా సమావేశం అయ్యారు. విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇక గ్రేటర్లో తన పట్టును నిలుపుకోవాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే నగర ఓటర్లను ఆకర్షించుకునేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేసింది. 21న కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేయనుంది. అలాగే రానున్న రెండు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే తుది జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. పార్టీ ముఖ్యనేతలు రేవంత్‌ రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమై ఉన్నారు. (రేవంత్‌కు పీసీసీ పగ్గాలు..!)

ఊపుమీద ఉన్న కాషాయదళం
దుబ్బాక ఇచ్చిన విజయంతో మంచి ఊపుమీద ఉన్న కాషాయదళం.. గ్రేటర్‌లోనూ కారుకు షాకివ్వాలని ఉవ్విళ్లూరుతోంది. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యనేతలను రంగంలోకి దింపి.. కమిటీల వారిగా ప్రచారం చేపడుతోంది. బిహార్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ ముఖ్యనేత భూపేంద్ర యాదవ్‌ను గ్రేటర్‌ పరిశీలకునిగా నియమించి.. నేతలకు దిశానిర్ధేశం చేయాలని బీజేపీ నిర్ణయించింది. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలకు బీజేపీ ఇన్‌ఛార్జుల నియామించింది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల బాధ్యత ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. 

ఇక రాజధానిలో జరిగే ఎన్నికల్లో పట్టు నిలపుకోవాలని అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధిష్టానం.. విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సంక్షేమ పథకాల అమలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల అప్పగింత వంటి కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. మరోవైపు అభ్యర్థుల వేటలో మంత్రి కేటీఆర్‌ బిజీగా ఉన్నారు. ఇప్పటికే తొలి జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించి వ్యూహాన్నే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ అమలు చేసే అవకాశం ఉంది. సిట్టింగ్‌ అభ్యర్థులకే సీట్లు దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈసారి 20 నుంచి 25 మంది సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉంది. ఇక ఎంఐఎంతో పొత్తు ఈ ఎన్నికల్లోనూ కొనసాగనుంది. కొన్ని డివిజన్లలో ఇరు పార్టీలు బలమైన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌, అసదుద్దీన్‌ ఒవైసీ సమావేశమైన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు దుబ్బాక ఫలితం నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈసారి వ్యూహం మార్చి కొత్త అభ్యర్థులను బరిలో దింపుతారా అనేది వేచి చూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement