మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలు | Sakshi
Sakshi News home page

మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలు

Published Mon, Jul 5 2021 2:28 PM

AIMIM MP Asaduddin Owaisi Slams On RSS Chief Mohan Bhagwat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ ముస్లిం​లకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ  మండిపడ్డారు. ముస్లిం సమాజంపై ద్వేషం హిందుత్వ నుంచి వచ్చిందని, తీవ్రమైన భావాజాలం ఉన్న కొంతమంది వల్ల వ్యాపిస్తోందని ఒవైసీ తీవ్రంగా ఆరోపించారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రచారం చేస్తున్న కొంతమంది నేరస్తులకు హిందుత్వ ప్రభుత్వం మద్ధతు పలుకుతోందని ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు.

ఆదివారం యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన ‘హిందుస్తానీ ఫస్ట్‌.. హిందుస్తాన్‌ ఫస్ట్‌’ అనే కార్యక్రమంలో మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న వారు హిందుత్వ వ్యతిరేకులని వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన ఒవైసీ.. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న నేరస్తులకు అధికారపార్టీ అండగా ఉంటోందని తీవ్రంగా ఆరోపించారు. భారత గడ్డపై హిందూ-ముస్లిం తేడాలేవీ లేవని, భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటేనని ఆర్‌ఎస్‌ఎస్‌ ముస్లిం విభాగం కార్యక్రమంలో మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement