తమ్ముడు.. తప్పుకో.. | - | Sakshi
Sakshi News home page

తమ్ముడు.. తప్పుకో..

Feb 1 2026 3:02 AM | Updated on Feb 1 2026 3:02 AM

తమ్ము

తమ్ముడు.. తప్పుకో..

‘అన్నా ఇవి చేతులు కాదే, కాళ్లనుకో. రాక రాక రిజర్వేషన్‌ కలిసొచ్చింది. ఈ ఒక్కసారి నేను కార్పొరేటర్‌ అయ్యేలా చూడన్నా. నువ్వొక్కడివి తప్పుకుంటే చాలే మంచి మెజార్టీతో గెలుస్తా. మిగతావారు అసలు నాకు పోటీయే కాదు. నీవు తప్పుకుంటే మిగతా వాళ్లు కూడా తప్పుకుంటారు’.. అంటూ రామగుండం కార్పొరేషన్‌లోని పలు వార్డుల్లో బరిలోని నిలిచిన అభ్యర్థుల వేడుకోలు.

‘అరే తమ్మీ.. మీ ఇద్దరూ నాకిష్టమే. నా గెలుపు కోసం కష్టపడ్డారు. మన పార్టీ వాళ్లే ఇద్దరూ పోటీలో ఉంటే ఓట్లు చీలిపోతాయి. మీరు తీవ్రంగా నష్టపోతారు. మీకంటే ఎక్కువగా ప్రత్యర్థే లాభపడతాడు. ఈ సారికి మనోడికే సపోర్ట్‌ చెయ్‌. కచ్చితంగా గెలుస్తాడు. నువ్వే పెద్ద మనసు చేసుకుని నామినేషన్‌ విత్‌డ్రా చేసుకో’ అంటూ ఓ పార్టీకి చెందిన ముఖ్యనేత రెబల్‌ కౌన్సిలర్‌గా పోటీచేస్తున్న అభ్యర్థికి ఇస్తున్నా సలహా.

సాక్షి పెద్దపల్లి:

నామినేషన్‌ ఘట్టం ముగియగా, పోటాపోటీగా ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయడంతో అన్ని పార్టీల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. టికెట్‌ దక్కని ఆశావహుల ఆగ్రహం, రెబల్స్‌ బెడద ఇప్పుడు పార్టీలకు సవాల్‌గా మారింది. నామినేషన్ల దాఖలుతో ప్రతీ డివిజన్‌, వార్డులో పోటీ స్వరూపం స్పష్టమైంది. అయితే పార్టీలు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రంగంలోకి దిగడంతో సమీకరణలు తారుమారయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో భారీగా రెబల్స్‌ నామినేషన్లు దాఖలు చేయడం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కో చోట పార్టీ అభ్యర్థితోపాటు రెబల్‌ అభ్యర్థి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఓట్ల విభజన తప్పదన్న ఆందోళన నాయకత్వాల్లో కనిపిస్తోంది.

3 వరకు గడువు

సగటున ఒక వార్డులో ఐదు నుంచి పదిమంది చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వీలైనంత మంది పోటీదారులను తప్పించేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 1,500లోపు ఓట్లున్న చోట కూడా ఐదారుగురు బరిలో ఉంటే గెలుపోటములు తారుమారు అవుతాయనే ఉద్దేశంతో బుజ్జగింపుల పర్వం ఊపందుకుంది. రెబల్స్‌ను అదుపులోకి తెచ్చేందుకు నేతలు రంగంలోకి దిగా రు. కొందరికి భవిష్యత్తులో పదవులు, హోదా లపై హామీలు ఇస్తుండగా, మరికొందరిని పార్టీ క్రమశిక్షణ పేరుతో వెనక్కి తగ్గమని కోరుతున్నారని తెలిసింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎక్కువ ఓట్లున్న వర్గానికి చెందిన అభ్యర్థి పోటీలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కొన్ని చోట్ల సీనియర్‌ నేతలు నేరుగా జోక్యం చేసుకొని రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా చాలా మంది ఆశావహులు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరని సమాచారం.

బంధువులు, సన్నిహితులతో చెప్పిస్తూ..

నామినేషన్లు వేసిన రెబల్స్‌ బరిలో నుంచి తప్పుకునేలా వారిని ఒప్పించేందుకు, వారెక్కడున్నారో ఎలాగోలా తెలుసుకుని ప్రధాన పోటీదారులు రహస్యంగా కలుస్తున్నారు. వారి బంధువులు, సన్నిహితుల నుంచి కూడా పోటీలో ఉండవద్దని చెప్పిస్తున్నారు. ప్రతి ఓటూ కీలకమైందని భావిస్తుండటంతో వీలైనంత వరకు ఎక్కువ మంది పోటీలో ఉండకుండా చూడాలని ప్రధాన పార్టీల మద్దతుదారులు చూస్తున్నారు. ఇందుకు కొందరు నామినేషన్‌ వేసిన వారి పలుకుబడిని తెలుసుకుని రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తూ పోటీ నుంచి విరమించేలా పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారు.

కులం ఓట్లే ప్రామాణికం

అభ్యర్థుల సామాజిక స్థితిగతులు, అతడి సామాజిక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి..? ఎంత ఖర్చు పెట్టగలుగుతారు..? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటి వారిని గురించి తగిన హామీలిచ్చి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. కొన్ని వార్డుల్లో సామాజికవర్గం ఓట్లు దండిగా ఉన్న అభ్యర్థులు మెట్టుదిగేది లేదని, పోటీచేసి తీరుతామని భీష్మించుకూర్చున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ సీనియర్లు కూడా ఏమీ చేయలేని అయోమయంలో ఉన్నారు.

రంగంలోకి సీనియర్లు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర పార్టీల నుంచి అధిక సంఖ్యలో పోటీ ఉండటం మంచిది కాదని భావించి.. మధ్యవర్తిత్వానికి జిల్లా నాయకులను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించే పనిలోపడ్డారు. రిజ ర్వుడ్‌ కంటే జనరల్‌ స్థానాల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. ఇందులో అసలు అభ్యర్థిగా ఎవరు నిలుస్తారు..? ఎవరు రెబల్‌గా కొనసాగుతారు..? చివరకు ఎవరు వెనక్కి తగ్గుతారు..? అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలి స్తాయా..? రెబల్స్‌ పోటీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే.

మున్సిపల్‌ పోరులో బుజ్జగింపుల పర్వం

ఒకే పార్టీ నుంచి నలుగురైదుగురు బరిలో

అభ్యర్థులకు తలనొప్పిగా మారిన రెబల్స్‌

మున్ముందు మంచి అవకాశాలంటూ హామీ

తమ్ముడు.. తప్పుకో..1
1/1

తమ్ముడు.. తప్పుకో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement