నామినేషన్ సమర్పయామి!
నామినేషన్ల దాఖలు ఇలా..
ఆఖరిరోజు భారీగా దాఖలు
అన్ని పార్టీలకు రెబల్స్ బెడద
అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి సీనియర్లు
తగ్గేది లేదు.. తప్పుకోమంటున్న రెబల్స్
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయింది. ఉమ్మడి జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించిన ప్రతీ ఒక్కరు తమ నామినేషన్‌ను పార్టీ తరఫున, ఇండిపెండెంట్‌గా ఇలా రెండు సెట్లు దాఖలుచేసి ఎన్నికలు మేము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. ఒక్కో వార్డు, డివిజన్‌లో ఒకే పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. వారిని బుజ్జగించేందుకు సీనియర్లు రంగంలోకి దిగారు. ఒకరికి అవకాశంఇచ్చి మిగతా వారు తప్పుకోవాలని చెబుతుండడంతో.. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలలో అసంతృప్తి మంటలు రాజుకుంటున్నాయి. పార్టీల అధిష్టానాలు ప్రకటించిన అభ్యర్థులపై పోటీకి సిద్ధమవుతున్న పలువురు స్థానిక నాయకులు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా తగ్గేది లేదు, తప్పుకునేది లేదు.. అంటూ రెబల్స్ స్పష్టంగా చెబుతుండటంతో ఎన్నికల సమీకరణాలు మారే పరిస్థితి కనిపిస్తోంది.
రంగంలోకి సీనియర్లు..
నామినేషన్ల ప్రక్రియపూర్తయిన నేపథ్యంలో శనివా రం నామినేషన్ల పరిశీలన జరగనుంది. పరిశీలనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని తిరస్కరిస్తారు. మిగతా నామినేషన్లు యాఽథావిధిగా ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఈ సమయం పార్టీలకు కీలకం. మూడు రోజుల గడువులో అసమ్మతి వర్గాలను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు నేతలతో చర్చలు జరిపి రెబల్స్‌ను వెనక్కి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు నాయకులు మాత్రం పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామంటూ పట్టుదలగా ఉండడం గమనార్హం.
గెలుపు ఓటములపై రెబల్స్ ప్రభావం
ఉమ్మడి జిల్లాలో రెబల్స్ ప్రభావం ఆయా మున్సిపాలిటీల్లో పార్టీల గెలుపుపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకేపార్టీ ఓట్ల చీలిక జరిగితే ప్రత్యర్థులకు లాభం చేకూరే పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు. ఇక చివరిరోజు నామినేషన్లతో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కింది. అభ్యర్థుల బలాబలాలు, రెబెల్స్ నిర్ణయాలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించనున్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మెజారిటీ సీట్లు గెలుచుకొని మున్సిపాలిటీలను కై వసం చేసుకోవాలంటే అసమ్మతి నేతలు, రెబల్స్ బెడద లేకుండా ప్రధాన పార్టీల నేతలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కరీంనగర్‌లో అత్యధికం...
రాయికల్‌లో అత్యల్పం...
ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలలో పాగా వేసేందుకు ఆయా పార్టీల నేతలతో పాటు ఇండిపెండెంట్ల నామినేషన్ల జోరు కొనసాగింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉండగా, అత్యధికంగా 1,248 నామినేషన్లు దాఖలయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా, 100 నామినేషన్లు దాఖలయ్యాయి.
కరీంనగర్ కార్పొరేషన్:
డివిజన్లు: 66, నామినేషన్లు: 1,248
చొప్పదండి : వార్డులు : 14, నామినేషన్లు : 117
హుజూరాబాద్: వార్డులు:30, నామినేషన్లు : 304
జమ్మికుంట: వార్డులు :30, నామినేషన్లు : 341
జగిత్యాల: వార్డులు : 50, నామినేషన్లు : 530
కోరుట్ల : వార్డులు 33, నామినేషన్లు: 337
రాయికల్ : వార్డులు :12, నామినేషన్లు : 100
మెట్‌పల్లి : వార్డులు : 26, నామినేషన్లు : ==
ధర్మపురి : వార్డులు : 15, నామినేషన్లు : 113
సిరిసిల్ల: వార్డులు: 39, నామినేషన్లు : 429
వేములవాడ : వార్డులు : 28, నామినేషన్లు : 260
రామగుండం కార్పొరేషన్:
డివిజన్లు: 60, నామినేషన్లు : 706
పెద్దపల్లి : వార్డులు : 36, నామినేషన్లు : 339
సుల్తానాబాద్: వార్డులు : 15, నామినేషన్లు : 139
మంథని : వార్డులు : 13, నామినేషన్లు : 158


