ప్రేమతో వద్దు అని చెబుదాం!
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఇటీవల 12 ఏళ్ల బాలుడు ఫోన్ కొనివ్వమని అమ్మను అడిగాడు. జీతం వచ్చాక ఇప్పిస్తానని చెప్పినా.. వినలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన పదోతరగతి చదువుతున్న ఓ బాలుడు బైక్ కొనివ్వాలని నెలరోజులుగా తల్లితండ్రులతో గొడవపడుతున్నాడు. ఇది భరించలేని పేరెంట్స్ ఇటీవల రూ. 2 లక్షల విలువైన స్పోర్ట్స్’ బైక్ కొనిచ్చారు. గతనెల బైక్‌పై ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బాలుడు రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొని మృతిచెందాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ బాలిక ఫోన్‌కొనివ్వాలని తండ్రిని వేధించింది. పేదరికంలో కొనివ్వలేని పరిస్థితి ఉన్నా.. అప్పుచేసి రూ. 15 వేల ఫోన్ కొనిచ్చాడు. రీల్స్ చూడడం అలవాటు చేసుకున్న ఆ బాలిక పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ఓ వ్యక్తి వలలో పడింది. జీవితం ఛిన్నాభిన్నం చేసుకుంది.
కరీంనగర్‌స్పోర్ట్స్/హుజూరాబాద్: చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏది కావాలన్నా కాదనకుండా ఇవ్వాలి అనే భావన రోజురోజుకీ తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. ఇది అతిగా మారితే పిల్లలు క్రమశిక్షణ కోల్పోవడమే కాకుండా, తల్లిదండ్రుల మాట విన కపోవడం, మారాం చేయడం, అడిగింది కొనివ్వ లేదని మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పిల్లలు అడిగారని అవసరం లేకపోయినా కొనివ్వడం, వారేం చేసినా వారించకపోవడం అతి గారాబంగా పరిగణించవచ్చు. దీనిని చిన్నప్పటి నుంచే కట్టడి చేయాలి. లేదంటే మానసిక ప్రవర్తనతో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తల్లిదండ్రుల పాత్ర ఏమిటి..?
అవసరం లేని విషయాలకు ‘కాదు’ అనడం నేర్పాలి. మొబైల్, టీవీ, గేమ్స్, ఖర్చులకు స్పష్టమైన నియమాలు పాటించాలి. చిన్న వయస్సు నుంచే ఇంట్లో పనులకు బాధ్యతలు అప్పగించాలి. పిల్లలతో మాట్లాడటానికి సమయం కేటాయించి వారి భావోద్వేగాలను అర్ధం చేసుకోవాలి. వారు అడిగిన దానికి ప్రత్యామ్నాయంగా వారికి ఉపయోగపడే వస్తువును కొనడం, ఆరోగ్య కరమైన జీవన శైలిని అలవాటు చేయాలి. అతి నిరాశ, ఒంటరితనం, మౌనం కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
జపాన్..: చిన్న వయస్సు నుంచే ఆత్మ నియంత్రణ, సామూహిక బాధ్యత నేర్పిస్తారు.
యూరప్ దేశాలు..: పిల్లలకు స్వేచ్ఛతో పాటు చిన్నచిన్న పనుల్లో బాధ్యతలు అప్పగిస్తారు.
అమెరికా..: పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడతారు. స్కూళ్లలోనే
కౌన్సెలింగ్ వ్యవస్థలు ఉన్నాయి.
పిల్లలు అడిగిన ప్రతిదీ కొనివ్వడం మొదలుపెట్టాక వాళ్లకు అగడం అనే భావనే ఉండదు. ఒకటి దొరికితే ఇంకొకటి కావాలి అంటారు. చివరికి అవసరం ఏది, కోరిక ఏది అనే తేడా వాళ్లకు తెలియకుండా పోతుంది. ప్రతిసారి అడిగినదంతా కొనివ్వడం ప్రేమ కాదు అని నాకు అనిపిస్తుంది. – కోడూరి సత్యనారాయణ,
డ్రాయింగ్ మాస్టర్, కరీంనగర్
ఏది పడితే అది కొనివ్వడం వల్ల పిల్లలు బాధ్యతలేని అలవాట్లు నేర్చుకుంటారు. డబ్బు విలువ తెలియదు. మొండిగా ప్రవర్తించడం అలవాటుగా మారుతుంది. ‘లేదు’ అనే మాటను కూడా అంగీకరించడం పిల్లలు నేర్చుకోవాలి.
– బి.అనితరాణి, ప్రైవేటు టీచర్, కరీంనగర్
ప్రస్తుతం చిన్నారులు అతి సున్నితమైన పెంపకంలో పెరుగుతున్నారు. వారికి కావాల్సినవి క్షణాల్లో దొరుకుతుండటంతో దాని విలువ తెలియకుండా పోతుంది. పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు ఆ వస్తువు తెలియజేయకుండా ఇస్తుండటంతో వారికి ఇస్తూ గారబం చేస్తున్నారు. పెద్దయ్యాక కూడా వారిలో అదే ప్రవర్తన జరుగుతుంది. క్రమశిక్షణ, మానసిక సైర్థ్యంతో పిల్లలను పెంచాలి.
– వర్షి,
మానసిక వైద్యనిపుణులు, హుజూరాబాద్
ప్రేమతో వద్దు అని చెబుదాం!


