కుష్టు నిర్మూలన అందరి బాధ్యత
పెద్దపల్లి: కుష్టును నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లిలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కుష్టు నిర్మూలనలో భాగస్వాములు అవుదామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్పర్శ లేని రాగి, గోధుమరంగు మచ్చలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు బి.శ్రీరాములు, కె.రమేశ్, బి.దేవిసింగ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉమామహేశ్వర్, ఎంపీహెచ్‌ఈవో రాజేశ్, ప్రిన్సిపాల్ దీప్తి, అధ్యాపకులు పాల్గొన్నారు.


