పోటెత్తిన భక్తులు
● మూడోరోజు సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
● జనసంద్రమైన జాతర ప్రాంగణాలు
● నేడు అమ్మవారల వన ప్రవేశం
భక్తుల కొంగుబంగారం సమ్మక్క– సారలమ్మను శుక్రవారం దర్శించుకునేందుకు జనం పోటెత్తారు. జిల్లాలోని గోదావరిఖని, గోలివాడ, ఓదెల మండలం కొలనూర్, సుల్తానా బాద్ మండలం నీరుకుల్ల తదితర ప్రాంతాల్లోని జాతరకు వేలాదిగా తరలివచ్చి అమ్మ వారలను దర్శించుకున్నారు. ఎత్తుబంగారం, తలనీలాలు, ఎదుర్కోళ్లు తదితర మొక్కులు చెల్లించుకున్నారు. చల్లగా చూడాలని వేడుకున్నారు. ధర్మారం మండలం నర్సింగపూర్‌లో సమ్మక్క–సారలమ్మను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ బంగారం మొక్కు చెల్లించుకున్నారు. రామగుండం ఇన్‌చార్జి కమిషనర్ అరుణశ్రీ కుటుంబ సమేతంగా గోలివాడలో పూజలు చేశారు. గోదావరిఖనిలో అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివచ్చారు. – సాక్షి నెట్‌వర్క్,పెద్దపల్లి


