కార్పొరేషన్‌లో తగ్గిన నామినేషన్లు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో ఈ ఎన్నికల్లో నామినేషన్లు తక్కువగా దాఖలు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 60 డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు మొత్తం 452 మంది 693 నామినేషన్లు దాఖలు చేశారు. 2020లో 50 డివిజన్లలో 815 నామినేషన్లను దాఖలు కాగా, 2014లో రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో 993 నామినేషన్లు దాఖలయ్యాయి. అప్పుడు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 512 మంది పోటీ చేశారు. 50 మంది గెలుపొందగా, 462 మంది ఓడిపోయారు. 363 మంది ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కలు సమర్పించలేదనే కారణంతో వారిపై ఎన్నికల సంఘం మూడేళ్లపాటు అనర్హత వేటు వేసింది. దీంతో కొందరు హైకోర్టు నుంచి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకొని, 2020లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశా రు. అప్పుడు 812 మంది నామినేషన్లను దాఖలు చేయగా, 355 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
3న తుది జాబితా
నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఎంత మంది బరిలో ఉంటారనేది ఈనెల 3న తేలనుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఈనెల 1న సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్లు చేసుకోవడానికి గడువు ఉంది. సదరు అప్పీళ్లను 2న పరిష్కరించిన తర్వాత 3న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తారు.
మొత్తం 693 దాఖలు
3న తేలనున్న అభ్యర్థుల తుది జాబితా


