ఏదోఒకటి.. ఎవరోఒకరు
గెలుపు గుర్రాల కోసం నేతల అన్వేషణ రిజర్వేషన్లు తేలాక రెండేసి స్థానాలపై ఫోకస్ మహిళకు కేటాయిస్తే సతీమణిని బరిలో నిలిపేలా ప్రణాళిక ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్న ఆశావహులు
సాక్షి పెద్దపల్లి:
మున్సిపల్ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించుకున్న నాయకులు.. పురపోరులో గెలుపు గుర్రాలను నిలిపేందుకు సమాయత్తమవుతున్నారు. ఎలాగైనా అధ్యక్షపీఠం దక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. మెజార్టీ స్థానాలు కై వసం చేసుకుని సత్తాచాటాలని బీఆర్‌ఎస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకోసం వారు చేసిన పనితీరు ఆధారంగా, మంచిపేరు, వ్యక్తిత్వం కలిగి ఉండటంతోపాటు, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని గుర్తించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. కేవలం డబ్బున్నవారికే టికెట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు.
రెండేసి స్థానాలపై గురి..
మున్సిపల్ ఎన్నికలకు ఆయా రాజకీయ పార్టీలు ఒకవైపు సమాయత్తం అవుతుంటే.. మరోపక్క పార్టీ ల తరఫున పోటీలో నిలవాలనుకునే వారు ఎక్కడో ఒకచోట రిజర్వేషన్ కలిసి వస్తుందనే ఆశతో రెండేసి స్థానాలపై గురిపెడుతున్నారు. తమకు దగ్గరగా ఉండే నాయకులతో మాట్లాడుతూ పెద్దనాయకులను ప్రసన్నం చేసుకునే పనిలోఉన్నారు. ఇలా రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతుండగా.. బరిలో నిలవాలనుకుంటున్న వారిలో టెన్షన్ మొదలైంది.
రంగంలోకి సతీమణులు..
రిజర్వేషన్ కలిసొచ్చినా.. ఒకవేళ ఆ స్థానం మహిళకు కేటాయిస్తే పరిస్థితి ఏమిటనే దానిపై ఆశావహులు ఆలోచనకు పదును పెడుతున్నారు. ఎందుకై నా మంచిదనే ముందస్తు వ్యూహంతో తమతోపాటు, వారి భార్యను వార్డులు/డివిజన్లలో ప్రచారం కోసం తమవెంట తిప్పుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కలియతిరుగుతూ ప్రజల్ని పలకరిస్తున్నారు. ముందస్తు ప్రచారం చేసుకుంటూ రిజర్వేషన్లను బట్టి భార్యాభర్తల్లో ఎవరోఒకరు పోటీచేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇక చైర్‌పర్సన్‌గా పోటీ చేయాలనుకునే కొంతమంది ఆశావహులు.. నిధులు సమకూర్చుకుంటూ తమను ముందుగా అభ్యర్థిగా ప్రకటిస్తే ఖర్చుల సంగతి తామే చూసుకుంటామంటూ ఆయా రాజకీయ పార్టీల అధిష్టానాల వద్ద పైరవీలు చేసుకుంటున్నారు.
రెండేసి స్థానాలపై కన్ను
జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఓటరు తుదిజాబితా విడుదలైంది. ఆ జాబితా ఆధారంగా ఆశావహులు రిజర్వేషన్‌పై లెక్కలు వేసుకుంటున్నారు. తమ వార్డు/డివిజన్లతో పాటు అతి సమీపంలోని స్థానాల్లో కులాల వారీగా జనాభా, ఓటర్ల సంఖ్యతో రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. రెండేసి స్థానాలపై దృష్టి పెట్టి ఎక్కడ కలిసొస్తే అక్కడ పోటీ చేయాలని పలువురు ఆశావహులు యోచన చేస్తున్నారు. పోటీలో నిలవాలనుకునే ఉత్సాహవంతుల్లో ఎంతమందిని అదృష్టం వరిస్తుందో తెలియదు కానీ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహుల్లో మాత్రం టెన్షన్ అప్పుడే మొదలైంది.


