32 మంది వైద్యుల ఎంపిక
గోదావరిఖని: సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యసేవలు మరింత మెరుగు కానున్నాయి. ఖాళీగా ఉన్న 32 వైద్యపోస్టులకు ఇటీవల ఉన్నతాధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 200మంది డాక్టర్లు హాజరయ్యారు. ప్రత్యేక వైద్య నిపుణుల నియామక ప్రక్రియ పూర్తిచేసి వచ్చేనెల రెండోవారంలోగా పోస్టింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా సంస్థలోని ఏడు ఏరియా ఆస్పత్రులు, 21 డిస్పెన్సనరీల్లో వైద్యుల కొరత తీరనుంది.
ప్రత్యేక వైద్య నిపుణులు వీరే..
సింగరేణి ఆస్పత్రుల్లో 32మంది వైద్యనిపుణుల ఎంపికను యాజమాన్యం పూర్తిచేసింది. ఇందులో నలుగురు జనరల్ సర్జన్లు, ఏడుగురు గైనకాలజిస్ట్‌లు, న లుగురు పిల్లల వైద్యనిపుణులు, ముగ్గురు చెస్ట్ ఫిజీ షియన్లు, ఇద్దరు ఈఎన్‌టీ సర్జన్లు, ఏడుగురు అనెస్తీషియన్లు, ఒక పాథలాజిస్ట్, ఒక ఫిజియాలజిస్ట్, ముగ్గురు హెల్త్ ఆఫీసర్లను ఎంపిక చేసింది. వీరికి త్వరలో నియామక పత్రాలు అందజేయనుంది.
అంతర్గత పదోన్నతులతోనూ భర్తీ..
సింగరేణి ఆస్పత్రుల్లో మిగిలిన మరిన్ని ఖాళీలను అంతర్గత పదోన్నతులు ద్వారా భర్తీ చేయనుంది. ప్రస్తుతం 180 ఖాళీలు ఉన్నట్లు యాజమాన్యం గుర్తించింది. తొలుత ఎక్స్‌రే, ల్యాబ్ టెక్నీషియన్లు, జూనియర్లకు స్టాఫ్‌నర్స్, ఆయా, స్కావెంజర్‌ను అర్హతను బట్టి పదోన్నతి కల్పించి ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది.
టెక్నీషియన్లను నియమిస్తాం
ప్రత్యేక వైద్య నిపుణుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. వచ్చేనెల రెండో వారంలోగా ఆస్పత్రుల్లో నియమిస్తాం. ఖాళీగా ఉన్న ఎక్స్‌రే, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను అంతర్గత పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తాం.
– కిరణ్‌రాజ్‌కుమార్, సీఎంవో, సింగరేణి


