ఓటర్లకు తాయిళాలు
మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే యత్నం రంగురంగుల ముగ్గులు, విలువైన కానుకలు పంపిణీ ఇప్పటి నుంచే ఇంటింటికీ చికెన్ అందజేత ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా ఆశావహుల యత్నాలు మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు
పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రానేలేదు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలూ ఫైనల్ కానేలేదు. అయినా ఆశావహులు కొందరు ఓటర్లను ఆకర్షించేందుకు తాయిళాలు పంచుతున్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే అత్యధిక సంఖ్యలో ఉండడంతో వారిఓట్లను రాబట్టుకోవడంలో అందరూ నిమగ్నమయ్యారు.
ఆ వార్డులపైనే అన్ని పార్టీల చూపు
అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల చూపులన్నీ ఆ వార్డులపైనే ఉన్నాయి. దీంతో గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది ఓటర్లకు లాభం చేకూర్చుతోందని అంటున్నారు. ఓ పార్టీ నాయకుడికి, ప్రస్తుతం పోటీకి సిద్ధమై తాయిళాలిస్తున్న ఆశావహుడికి గతంలో గొడవలు అయినట్లు ప్రచారం సాగుతోంది. ఈక్రమంలో తమదే పైచేయి ఉండాలనే లక్ష్యంతోనే తాయిళాల ప్రక్రియ మొదలైందని, నోటిఫికేషన్ వచ్చాక పరిస్థితి మరెలా ఉంటుందోనని స్థానికంగా ప్రచారం సాగుతోంది.


