
బకాయిల బండ
● జిల్లాలో భారీగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు ● వసూలు కాని బిల్లులు రూ.3,728.48 కోట్లు ● నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి రావల్సినవే ఎక్కువ
సాక్షి, పెద్దపల్లి: నిరుపేదల ఒక్క నెల బిల్లు చెల్లించకపోతేనే కనెక్షన్ తొలగించే విద్యుత్ అధికారులు.. ప్రభుత్వ శాఖల నుంచి బకాయిల వసూళ్లను పట్టించుకోవడం లేదు. వేలకోట్లు బకాయిల గుదిబండగా మారినా వసూళ్లపై దృష్టి పెట్టడం లేదు. జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల వాటా అత్యధికంగా ఉంది. జిల్లాలో విద్యుత్ బకాయిల భారం రూ.3,728.48కోట్లకు చేరింది. ఇంత భారీగా బకాయిలు పడ్డ వసూలుకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
21 శాఖలు... రూ.31.48కోట్లు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 ప్రభుత్వ శాఖలు కలిపి రూ.31.48కోట్లు విద్యుత్ బకాయిలున్నాయి. అత్యధికంగా గ్రామపంచాయతీలు రూ.19.72 కోట్లు బకాయిలుండగా, మున్సిపాలిటీలు రూ.3.70 కోట్లు, మెడికల్ కాలేజీ రూ.2.1 కోట్లు, వైద్యావిధాన్‌పరిషత్ రూ1.4 కోట్లు బకాయిలు పడ్డాయి.
ఇరిగేషన్ నుంచే అత్యధికం
జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన బ్యారేజీలు, పంపుహౌస్‌లకు సంబంధించిన విద్యుత్ బకాయిలు అధికంగా ఉన్నాయి. నందిమేడారం పంప్‌హౌస్‌కు సంబంధించి రూ.2,672కోట్లు, అంతర్గాం మండలం గోలివాడ పంప్‌హౌస్‌కు రూ.564కోట్లు, సుందిళ్ల పంప్‌హౌస్‌కు సంబంధించి రూ.406 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,978కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వీటితోపాటు ఎల్లంపల్లి, ఇతర మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ.426 కోట్లు బకాయిలు ఉన్నాయి. మొత్తంగా నీటిపారుదలశాఖ ప్రాజెక్టులకు సంబంధించి రూ.3,404కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
హెచ్‌టీ కనెక్షన్ల బకాయిలు రూ.293 కోట్లు
ఎక్కువ విద్యుత్ లోడ్ అవసరమైన హెచ్‌టీ కనెక్షన్లు గల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అదే స్థాయిలో బకాయిలున్నాయి. ప్రధానంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ రూ.38లక్షలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ రూ.29లక్షలు, మెడికల్ కాలేజీ స్టేజ్–2కు సంబంధించి రూ.76లక్షలు ఉన్నాయి. మొత్తంగా హెచ్‌టీ కనెక్షన్లకు సంబంధించి రూ.293కోట్లు బకాయిలున్నాయి.
బిల్లుల విషయమై చెబుతున్నాం
కొన్ని ప్రభుత్వ శాఖలు విద్యుత్ బకాయిలను నెలలతరబడి చెల్లించడం లేదు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతీ నెల నోటీస్‌లు అందిస్తున్నాం. కార్యాలయాల నిర్వహణకు నిధులు విడుదలవడంతోనే కొన్ని శాఖల అధికారులు ఒకేసారి చెల్లిస్తున్నారు. వినియోగదారులకు ఎక్కువ ఇబ్బంది కలుగకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం.
– మాధరవరావు, ఎస్‌ఈ

బకాయిల బండ

బకాయిల బండ